‘పెన్షన్‌ రూల్స్‌ చట్టాన్ని రద్దు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘పెన్షన్‌ రూల్స్‌ చట్టాన్ని రద్దు చేయాలి’

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

‘పెన్షన్‌ రూల్స్‌ చట్టాన్ని రద్దు చేయాలి’ నేడు ‘డయల్‌ యువర్‌ డీఎం’ ముగిసిన ఎస్‌జీఎఫ్‌ పోటీలు 13 నుంచి నిరవధిక సమ్మె

హన్మకొండ అర్బన్‌: పెన్షన్‌ రూల్స్‌ వ్యాలిడేషన్‌ చట్టం–2025ను రద్దు చేయాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పరికిపండ్ల వేణు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ మొదటి దశలో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, రెండో దశ డిసెంబర్‌ 12న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ, మూడో దశలో డిసెంబర్‌ 13న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్ల సంయుక్త సదస్సు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ధర్నా అనంతరం 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య, వర్కింగ్‌ జనరల్‌ సెక్రటరీ బేతి శంకర్‌ లింగం, ఆర్థిక కార్యదర్శి సిద్ధి రాజయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, యూనిట్ల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, సలహాలు సూచనలు స్వీకరించడానికి బుధవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్‌–1 డిపో మేనేజర్‌ పుప్పాల అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్‌–1 డిపో నుంచి డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల తదితర రూట్ల ప్రయాణికులు 9959226047 నంబర్‌కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని, సమస్యలు చెప్పాలని డీఎం కోరారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో రెండు రోజులపాటు జరిగిన 70వ హనుమకొండ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14, 17 బాలబాలికల ఎంపిక పోటీలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడుతూ క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం అభినందనీయమని అన్నారు. డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో రాణించాలని సూచించారు. కబడ్డీ, ఖోఖ, వాలీబాల్‌ క్రీడల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్‌ హనుమకొండ జిల్లా నిర్వహణ కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. వివిధ మండలాల నుంచి మొదటి రోజు 2,100, రెండో రోజు 366 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. డీవైఎస్‌ఓ ప్రశాంత్‌, టీఎస్‌ పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, టీజీ పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, శ్రీధర్‌రావు, కుమారస్వామి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ అర్బన్‌: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 13 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, డీఎంహెచ్‌ఓ అప్పయ్యకు సమ్మె నోటీస్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, పీఆర్సీ, 5 శాతం ఇంక్రిమెంట్‌, 8 శాతం లాయల్టీ బోనస్‌, 100 శాతం గ్రాస్‌ జీతం అమలు చేయాలని కోరారు. మాతృత్వ సెలవులు, ఇన్సూరెన్‌్స్‌, సర్వీస్‌ కొనసాగింపు, ఆర్‌ఓపీ తదితర సమస్యలు పరిష్కరించాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మహేందర్‌రావు పుట్ట, ప్రధాన కార్యదర్శి ఎండీ రుక్ముద్దీన్‌, కోశాధికారి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ మొగిలి నరేశ్‌, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement