ఎల్కతుర్తి: హనుమకొండ– కరీంనగర్ ప్రధాన రహదారిపై ఎల్కతుర్తి మండలంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పోలీసులు గుర్తించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న మూడు బ్లాక్‌స్పాట్లను వరంగల్ సీపీ శ్వేత మంగళవారం పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం సీపీ శ్వేత స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఎల్క తుర్తి పోలీసులు సీపీకి పూలమొక్క అందజేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులు పరిశీలించిన సీపీ పోలీస్‌స్టేషన్ ఆవరణమంతా పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. సీపీ వెంట డీసీపీ ధార కవిత, అడిషినల్ ఎస్పీ రాయల ప్రభాకర్‌రావు, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ శ్రీను, ఎస్సై నరసింహారావు, ఆర్‌ఆండ్‌బీ అధికారులు, ఆర్టీఓ మధుసూదన్‌రెడ్డి, ఎన్‌హెచ్ అధికారులు ఉన్నారు.
వరంగల్–ఖమ్మం ఎన్‌హెచ్ పరిశీలన
మామునూరు: జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలకు అడ్డకట్ట వేసేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఆర్టీఏ జంక్షన్ నాయుడు పెట్రోల్ బంక్ నుంచి ఇల్లందు వరకు ప్రమాదకర ప్రాంతాలను ఏసీపీ వెంకటేష్, ఎంవీఐ శోభన్‌బాబు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, హెన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్ బీ అధి కారులతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మంగళవారం పరిశీలించారు. ప్రమాదాల కు ఆస్కారం ఉన్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రహదారి పరిస్థితులు, వాహనాల రాకపోకలు, మలుపులు, ప్రమాదాలకు దారితీస్తున్న ఇతర కారణాలపై సీపీ ఆరా తీశారు. ఆర్టీఏ జంక్షన్ నాయుడు పెట్రోల్ బంక్ నుంచి బొల్లికుంట క్రాస్ వరకు నిత్యం జరుగుతున్న ప్రమాదాల వివరాలను పరిశీలించి, ఇకపై ప్రమాదాలు జరగకుండా అవసరమైన భద్రతా చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై 108 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 80 మంది వరకు మరణించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
జాతీయ రహదారిపై
బ్లాక్‌స్పాట్ల గుర్తింపు


