హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వచ్చిన ప్రతీ అర్జీని పరిష్కరించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చాహత్, అదనపు కలెక్టర్ రవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గురుకుల హాస్టళ్లు, ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలను సంక్షేమ శాఖల ప్రత్యేక అధికారులు సత్వరం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో నమోదుకు అర్హులైన పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లో 136 అర్జీలు, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయంలో 38, ఎంపీడీఓ కార్యాలయాల్లో 135 అర్జీలు వచ్చాయి. మొత్తం 309 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇనన్‌చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించరా?
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నగరంలోని కాలనీల్లో సమస్యలు పరిష్కరించరా? అంటూ బల్దియా గ్రీవెన్స్‌లో కమిషనర్ టి.వెంకన్న ఎదుట నగరవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వెంకన్న దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 92 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు 36, ఇంజనీరింగ్‌కు 34, ఆరోగ్యం, పారిశుద్ధ్యం 9, రెవెన్యూ విభాగానికి 11, నీటి సరఫరా 2 చొప్పున నమోదయ్యాయి. ప్రతీ అర్జీని బాధ్యతతో పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్


