ఓటు హక్కుపై దాడిని సహించం | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కుపై దాడిని సహించం

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

హన్మకొండ అర్బన్‌: ఓటు హక్కును హరించే ఏ ప్రయత్నాన్ని అయినా సహించబోమని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, అక్రమ తొలగింపులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓటు చోరీ అంశంపై రాహుల్‌ గాంధీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా సోమవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని పాల్గొన్నారు. హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియం నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలంటే ప్రతీ దశ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా తయారీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు, ఓటర్ల తొలగింపులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్‌, దుద్దిళ్ల శ్రీనుబాబు, ఈవీ శ్రీనివాస్‌ రావు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement