గీసుకొండ : మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో మాల్దీవుల దేశానికి చెందిన 30 నగరాల ప్రజాప్రతినిధులు శుక్రవారం అధ్యయన పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్‌డీపీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాయకత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించారు. గ్రామంలో మహిళా సంఘాలు, గ్రామ సంఘాల కార్యకలాపాలు, అంగన్‌వాడీ కేంద్రాల సేవలు, గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంపై ప్రతిని ధులు మహిళా సభ్యులతో చర్చించారు. పార్వతి మహిళా పొదుపు సంఘం, అభ్యుదయ గ్రామ సంఘం పనితీరును పరిశీలించి ప్రశంసించారు. మహిళా సంఘాల ద్వారా పాఠశాలల అభివృద్ధి, పిల్లల ఆరోగ్యం–పోషణ, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలు తమకు స్ఫూర్తి నిచ్చాయని మాల్దీవుల ప్రతినిధులు తెలిపారు. కోర్సు డైరెక్టర్ అంజన్ కుమార్ భంజా మార్గదర్శకత్వంలో కోఆర్డి నేటర్లు అరుణ్‌రాజ్ మాలి, ఆసియా పర్యటనను సమన్వయం చేశారు. కార్యక్రమంలో మాల్దీవుల ప్రతినిధులు రిష, శరీణ, సీయునా, అమీనత్ ఇబ్రాణి, రేష్మ, ఏపీడీ పి.శ్రీనివాస్, డీపీఎం అనిల్, ఏటీఎంలు ఈశ్వర్, రాజు, సీసీ సురేష్, సర్పంచ్ స్వరూప రమేష్, ఉపసర్పంచ్ మేడిద ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


