సోషల్ మీడియాలో
పేర్ల హోరు..!
సాక్షి, వరంగల్: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి ఏ పేరు పెట్టాలన్న అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, నెటిజన్ల వరకు తమకు నచ్చిన పేర్లను సూచిస్తున్నారు. కొందరు వరంగల్ చారిత్రక నేపథ్యానికి అద్దంపట్టే పేర్లను ప్రతిపాదిస్తుండగా.. మరికొందరు కాకతీయుల వారసత్వం, తెలంగాణ ఉద్యమం, సామాజిక పోరాటాలకు ప్రతీకలైన వ్యక్తుల పేర్లను సూచిస్తున్నారు. విమానాశ్రయానికి పేరు సూచించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ప్రజలను కోరడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. ఇప్పటికే మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ పూర్తిచేసి స్థలాన్ని ఏఏఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. 949.44 ఎకరాల విస్తీర్ణంలో కొద్ది నెలల క్రితం రూ.203.49 కోట్లతో రన్ వే ఆధునికీకరణ నుంచి టెర్మినల్‌కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్ అప్రాన్, ట్యాక్సీ వేలు, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాల వరకు టెండర్లు పిలిచిన ఏఏఐ.. ఇటీవల రూ.213.59 కోట్ల అంచనా వ్యయంతో నూతన డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్, ఫైర్ స్టేషన్, ఈ అండ్ ఎమ్ వర్క్‌షాప్ వంటి కీలక మౌలిక వసతులను నిర్మించేందుకు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే.
● పేర్ల సూచనలతోపాటు వివిధ సంస్థలు, సోషల్ మీడియా పేజీలు ఆన్‌లైన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతా నిర్వహించిన పోల్‌లో ప్రొఫెసర్ జయశంకర్, రాణి రుద్రమ, సమ్మక్క–సారక్క, చాకలి ఐలమ్మ పేర్లను ఆప్షన్లుగా ఇచ్చింది. ఈ పోల్‌లో వచ్చిన స్పందనలపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది.
● ఇక నెటిజన్లు మరో అడుగు ముందుకేసి రీల్స్, ఏఐ ఆధారిత చిత్రాలు, పోస్టర్లు, ఎయిర్‌పోర్టు బోర్డుల నమూనాలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు గేటు వద్ద ఏ పేరు ఉంటే ఎలా కనిపిస్తుందో చూపించే ఊహాజనిత డిజైన్లు వైరల్ అవుతున్నాయి. దీంతో పేరు చర్చ కేవలం రాజకీయ, అధికార వర్గాలకే పరిమితం కాకుండా యువత, సోషల్ మీడియా వర్గాల్లోనూ విస్తరిస్తోంది.
వరంగల్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాకతీయ చరిత్ర, సంస్కృతికి ప్రతిబింబంగా ఎయిర్‌పోర్టు డిజైన్లు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి జూలైలో కేంద్ర పౌర విమానయాన మంత్రితో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. దీంతో పేరు ఎంపికపై జరుగుతున్న చర్చలో వరంగల్ చరిత్ర, కాకతీయ వారసత్వం ప్రధాన అంశాలుగా మారాయి. సోషల్ మీడియాలో ఎన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నా.. తుది పేరుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. అయితే కాకతీయ వారసత్వమా.. వీరవనితల చరిత్రా.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తా.. సామాజిక పోరాటాల గుర్తింపా.. అనే అంశాల చుట్టూ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయం నిర్మాణం ముందుకు సాగుతున్నకొద్దీ పేరుపై చర్చ కూడా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు పేరుపై చర్చ కొనసాగే అవకాశముంది.
ఏ నోట విన్నా ‘మామునూరు’ మాట
విమానాశ్రయం పేరుపై
సోషల్ మీడియాలో చర్చ
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పేర్ల సూచన
వ్యక్తులు.. కాకతీయుల
పాలనకు ప్రతీకగా పేర్లు
పలు సంస్థల ఆన్‌లైన్ పోల్
రాణి రుద్రమదేవి, కాకతీయ, సమ్మక్క–సారలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, పీవీ నరసింహారావు తదితర పేర్లు చర్చలోకి వచ్చాయి. దర్శకుడు వంగా సందీప్‌రెడ్డి ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’, ‘కాకతీయ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు’ పేర్లను సూచించారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. సమ్మక్క–సారలమ్మ పేరును సూచించారు. సీపీఐ నేత నారాయణ పీవీ నరసింహారావు పేరు సూచించగా.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్.. రాణి రుద్రమదేవి పేరును ప్రతిపాదించారు. మరోవైపు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ పేరు పెట్టాలని అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీంతో రోజుకో కొత్త పేరుతో ప్రతిపాదనలు తెరపైకి వస్తుండడంతో తుదగా ఏ పేరు పెడతారన్న ఆసక్తి పెరుగుతోంది.


