న్యూశాయంపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. జిల్లాలోని 13 మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గీసుకొండ 104.2 మిల్లీమీటర్లు, దుగ్గొండి 66.2, నల్లబెల్లి 54.2, నర్సంపేట 51.4, ఖానాపురం 53.4, చెన్నారావుపేట 85.2, సంగెం 84.6, వర్ధన్నపేట 97.8, రాయపర్తి 81.6, పర్వతగిరి 68.4, నెక్కొండ 80, ఖిలా వరంగల్ 78, వరంగల్ 87.2 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లాలో 76.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని జిల్లా యంత్రాంగం సూచించింది. కాగా, భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ శాఖ అప్రమత్తం : ఎస్‌ఈ
హన్మకొండ: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.ఆనందం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా స్థితిని పరిశీలించాలని పేర్కొన్నారు. వినియోగదారులకు విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 24/7 పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్ 87124 84506, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912 లో సంప్రదించాలని కోరారు. వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచామని తెలి పారు. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయని, వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సగటు వర్షపాతం
76.3 మిల్లీమీటర్లు నమోదు


