హన్మకొండ: ఇన్నాళ్లు వర్షాభావ పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరైన రైతాంగం బుధవారం రాత్రి కురిసిన వర్షం ఊరటనిచ్చింది. సకాలంలో వర్షం కురవకపోయినా భూగర్భ జలాలను నమ్ముకుని రైతులు పంటలు సాగు చేశారు. వరి సాగు చేసిన రైతులు భూగర్భ జలాలు సమృద్ధిగా లభించక పంటలు ఎండిపోతున్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక ఆశగా ఆకాశం వైపు చూస్తున్న క్రమంలో భారీ వర్షం కురవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం రాత్రి 8.30 వరకు సగటున 78.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో అత్యఽధికంగా 113.6 మిల్లీమీటర్లు, వేలేరులో 107.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమదేవరపల్లిలో 68.6 మిల్లీమీటర్లు, ఎల్కతుర్తిలో 76.2, కమలాపూర్‌లో 22.2, హసన్‌పర్తిలో 58.2, ధర్మసాగర్‌లో 97.2, కాజీపేటలో 85, హనుమకొండలో 75,2, ఐనవోలులో 74,1, పరకాలలో 82.3, దామెరలో 85.5, శాయంపేటలో 65.7, నడికూడలో 83.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
విద్యుత్ శాఖ అప్రమత్తం
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.సామ్యానాయక్ తెలిపారు. వర్షం వల్ల తలెత్తే సమస్యలు ఎదుర్కొనుదేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా స్థితిని పరిశీలించాలని ఆదేశించారు. వినియోగదారులకు విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్ 87124 84506, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని కోరారు.
చెరువు మత్తడి..
కాజీపేట: కాజీపేట మండలం సోమిడి శివారులోని రేణుక ఎల్లమ్మ చెరువు నిండుకుండలా మారింది. ఒకవైపు వర్షపు జల్లులు.. మరోవైపు మత్తడి దూకుతుండడంతో ప్రవాహం ఉరకలేస్తోంది. ఓవైపు సోమిడి మహిళలు ప్రత్యేక పూజలు చేస్తుండగా, మరోవైపు మత్స్యకారులు చేపలవేట సాగిస్తున్నారు. మత్తడి పారుతుండడంతో సుబ్బయ్యపల్లె, రంగుల కంపెనీ, ఉనికిచర్ల గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో వర్షప్రభావం, ప్రస్తుత పరిస్థితులు, గురు, శుక్రవారాల్లో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. మండలాల వారీగా వర్షపాతం, చెరువులు, వాగులు, వంకలు, రహదారుల పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను వెంటనే తొలగించి ప్రధాన నాలాల్లో వరద నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై కంట్రోల్ రూమ్‌లో అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు.


