సాక్షి, వరంగల్/కాశిబుగ్గ: పసికందుల ప్రాణాలను కాపాడాల్సిన ఎంజీఎం నవజాత శిశు చికిత్స కేంద్రంలో మౌలిక వసతుల కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల నుంచి నెలలోపు శిశువులను అత్యవసర చికిత్స కోసం ఇక్కడికి తీసుకొస్తుండగా.. అవసరమైన స్థాయిలో ప్రాణరక్షక పరికరాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ రిమ్స్‌లోని నవజాత శిశు విభాగంలో అగ్ని ప్రమాదం జరిగి చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఎంజీఎంలో భద్రతపై కూడా చర్చ మొదలైంది.
శిశువులకు తప్పని తిప్పలు..
ఎంజీఎంలోని నవజాత శిశు చికిత్స విభాగంలో స్పెషల్ న్యూ బర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)లో రెండు యూనిట్లు, నియోనాటనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లో ఒక యూనిట్ పనిచేస్తోంది. 40 పడకల సామర్థ్యమున్న ఈ యూనిట్‌లలో నెలలోపు పసికందుల్లో కామెర్లు, శ్వాస సంబంధిత సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, ఫిట్స్, తక్కువ బరువుతో పుట్టిన వారు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు చికిత్స అందిస్తారు. ఎన్‌ఐసీయూలో అత్యంత సీరియస్ కేసులకు వెంటిలేటర్, తక్కువ బరువున్న శిశువులకు వార్మర్లు, శ్వాస ఇబ్బందులకు సీపాప్ తదితర పరికరాలు కీలకం. ఇవి అవసరానికి తగిన సంఖ్యలో లేవని ఆరోపణలు వస్తున్నాయి. ఒక వార్మర్‌లో వెచ్చదనం కోసం ఒకరిని పడుకోబెట్టాల్సి ఉండగా ఇద్దరిని పడుకోబెడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. సరిపడా వెంటిలేటర్లు, సీపాప్ సరిపోక శిశువుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయనే విమర్శలున్నాయి.
ఎంజీఎం ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఐసీయూపై ఆందోళన
ఇంక్యుబెటర్లు, వార్మర్లు, సీపాప్, వెంటిలెటర్ల కొరత
అవసరమైనన్ని పరికరాలు
లేకపోవడంతో తిప్పలు
ఫలితంగా అత్యవసర వైద్యంలో
ఇబ్బందులు
విద్యుత్, ఫైర్ సేఫ్టీ ఆడిట్‌పై లేని స్పష్టత


