అటు బీజేపీ.. ఇటు సీజేపీ | - | Sakshi
Sakshi News home page

అటు బీజేపీ.. ఇటు సీజేపీ

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

సాక్షి, వరంగల్‌/కాశీబుగ్గ: బీజేపీ, సీజేపీ ప్రతినిధుల రాకతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆరోగ్యశ్రీ వార్డులో పెచ్చులూడిన ఘటనపై ఇరు పార్టీల ప్రతినిధులు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఒకవైపు డీఎంఈ డాక్టర్‌ వాణి, కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సందర్శించిన సమయంలో వేర్వేరుగా వచ్చిన బీజేపీ, సీజేపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్పత్రిలోకి వచ్చారు. డీఎంఈ, కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తామంటూ దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. మట్టెవాడ సీఐ కరుణాకర్‌రావు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎంజీఎం వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. రోగులకు సరైన సేవలు అందించలేని అధికారులు, వైద్యశాఖపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎంజీఎంలో

కాక్రోచ్‌ జనతా పార్టీ నాయకులు..

మరోవైపు హైదరాబాద్‌ నుంచి వచ్చిన (సీజేపీ) కాక్రోచ్‌ జనతా పార్టీ నాయకులు ఎంజీఎం ఆస్పత్రిలోకి చొచ్చుకొచ్చారు. డీఎంఈని, కలెక్టర్‌ను కలవాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎంజీఎం సమస్యలు చెబుతామంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేయగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు విజయ్‌ మల్లంగి మీకెమో బంగ్లాలు, కాన్వాయ్‌లు కావాలి, సామాన్యులైన మేము చావాలా అంటూ నినదించారు. గాయాల చికిత్సకు ఎంజీఎంకు వస్తారని, అయితే ఇప్పుడు ఇక్కడే గాయాలవుతున్న పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్లాబ్‌ పెచ్చులు ఊడి ఆరుగురికి గాయాలైతే ఎక్కడ ఎమ్మెల్యే, ఎంపీ అంటూ ప్రశ్నించారు. అపోలోకు రిబ్బన్‌ కటింగ్‌కు పోటీ.. పేదల ఎంజీఎం పట్టదా అంటూ ప్రశ్నించారు. దీంతో వరంగల్‌ కేంద్రంగా సీజేపీ పోరాటం ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.

వరంగల్‌ ఎంజీఎం కేంద్రంగా

ఉద్రిక్త వాతావరణం

ఆరోగ్యశ్రీ వార్డులో పెచ్చులూడిన ఘటనపై నాయకుల సీరియస్‌

ఓవైపు వైద్యారోగ్య ఉన్నతాధికారుల పర్యటనతో హైటెన్షన్‌

రంగంలోకి దిగిన పోలీసులు,

భద్రతా సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement