ఆయిల్‌పామ్‌ సాగుకు రాయితీ | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగుకు రాయితీ

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

ఖిలా వరంగల్‌: ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు, రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. 2026–2027 వార్షిక ప్రణాళికలో భాగంగా జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుచేస్తున్న రైతులకు నీటి కుంటల నిర్మాణం, పలు పరికరాలు కొనుగోళ్లకు రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు.

నీటి కుంటకు రూ.90 వేలు..

అయిల్‌పామ్‌ తోటల్లో నీటి లభ్యతను మెరుగుపరిచేందుకు, వర్షపు నీటిని నిల్వ చేసుకునే నీటి కుంటల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. నిర్దేశిత కొలతలతో నిర్మించే ఒక్కో నీటి కుంటకు రూ.90 వేలు ఇస్తారు. కుంట అడుగు భాగం 14.14 మీటర్లు, మధ్య భాగం 20.20 మీటర్లు, పైభాగం 21.21 మీటర్లు, లోతు 3.50 మీటర్లు ఉండాలి. ఈపరిమాణంలో సుమారు 8.94 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. వర్షపు నీటిని సంరక్షించడంతోపాటు వేసవిలో ఆయిల్‌పామ్‌ తోటలకు నీటి అవసరాలను కొంతమేర తీర్చేందుకు కుంటలు ఉపయోగపడుతాయని అధికారులు సూచిస్తున్నారు.

పరికరాలపై రాయితీ ఇలా..

●కట్టర్‌(టెలిస్కోపిక్‌ హార్వెస్టింగ్‌ పోల్‌) : గెలలు కోసే 50 అడుగుల పొడవు ఉండే కట్టర్‌ (టెలిస్కాపిక్‌ హర్వెస్టింగ్‌ పోల్‌)ను రైతులు నేరుగా కొనుగోలు చేసి బిల్లును సంబంధిత ఉద్యానశాఖ అధికారికి అందించాలి. ఒక కట్టర్‌కు రూ.2,500 లేదా మొత్తం బిల్లులో 50 శాతం రాయితీ ఇస్తారు.

●వైర్‌ మెష్‌ : కొత్తగా నాటనున్న ఆయిల్‌పామ్‌ మొక్కలను పందికొక్కులు, ఎలుకలు, ముళ్లపందులు, అడవిపందుల నుంచి రక్షించేందుకు 22 గేజ్‌ జీఐ వైర్‌మెష్‌ (జాలి) ఉపయోగిస్తారు. దీనికోసం ఎకరాకు రూ.20 వేల రాయితీ అందుతుంది.

● మోటరైజ్ట్‌ చిసెల్‌: (గెలలు కోసే మోటారు యంత్రం) : ఎత్తయిన ఆయిల్‌ పామ్‌ తోటల్లో గెలలు కోయడానికి మోటారుతో నడిచే యంత్రాలకు (20 అడుగులు, 15 అడుగులు) బిల్లులో 50 శాతం లేదా రూ.15 వేలు రాయితీ ఇస్తారు.

●అల్యూమినియం పోర్టబుల్‌ ల్యాడర్‌ (నిచ్చెన) : 21, 30 అడుగులు ఉండే నిచ్చెనల కొనుగోలుపై బిల్లులో 50 శాతం లేదా గరిష్టంగా రూ.5 వేల రాయితీ ఉంటుంది.

● చాప్‌ కట్టర్‌/ ష్రెడర్‌: ఆయిల్‌పామ్‌ మట్టలు, ఇతర వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడానికి వాడే యంత్రం. బిల్లులో 50 శాతం లేదా రూ.50 వేల సబ్సిడీ ఇస్తారు.

మండలాల వారీగా ఉద్యానశాఖ అధికారుల వివరాలు..

వరంగల్‌, ఖిలా వరంగల్‌, గీసుగొండ,

సంగెం మండలాల ఉద్యాన అధికారి

మానస (8977714060)

నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల

ఉద్యాన అధికారి ఎ.జ్యోతి (8977714061)

వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి ఉద్యాన

అధికారి జె. వేణుమాధవ్‌–8977714062

నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట

మండలాల ఉద్యాన అధికారి

బి.తరుణ్‌ (8977714053)

నీటి కుంటల నిర్మాణం, పరికరాల

కొనుగోళ్లకు ప్రోత్సాహకాలు

సద్వినియోగం చేసుకోవాలని

ఉద్యానశాఖ అధికారుల సూచన

అధికారులను సంప్రదించాలి..

రాయితీలను పొందాలనుకునే అర్హత కలిగిన ఆయిల్‌పామ్‌ రైతులు తమ పరిఽధిలోని డివిజన్‌ ఉద్యాన అధికారి, ఉద్యాన విస్తరణ అధికారి లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. అవసరమైన దరఖాస్తులు, పత్రాలను సమర్పించి రాయితీలు పొందాలి. రైతులు రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి.

ఆర్‌.శ్రీనివాస్‌రావు, జిల్లా ఉద్యాన, పట్టు

పరిశ్రమల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement