● డీసీహెచ్‌ఎస్ డాక్టర్ వంశీకృష్ణ
కమలాపూర్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్ (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్) డాక్టర్ వంశీకృష్ణ సూచించారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలు, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. ఇన్ పేషంట్లతో పాటు ఔట్ పేషంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది స్పందన, ఆస్పత్రిలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, నర్సింగ్ అధికారులు, పారా మెడికల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగానికి సంబంధించిన సమస్యలు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు తమ ప్రవర్తన మార్చుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోసారి ఆస్పత్రిని సందర్శిస్తానని, అప్పటికి మంచి ఫలితాలు, మెరుగైన సేవలు కనిపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చందునాయక్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


