చంద్రగిరి గుట్టల పైనుంచే గురి! | - | Sakshi
Sakshi News home page

చంద్రగిరి గుట్టల పైనుంచే గురి!

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

చంద్రగిరి గుట్టల పైనుంచే గురి! పోరుగడ్డ బిడ్డలుగా అన్యాయంపై ఉద్యమిస్తాం

పరకాల: పరకాల సమీపంలోని చంద్రగిరి గుట్టలు తెలంగాణ సాయుధ పోరాటయోధులకు రహస్య స్థావరంగా మారాయి. జాతీయ జెండాతో ఊరేగింపు చేసినందుకు 1947 సెప్టెంబర్‌ 17న పరకాల చాపలబండ వద్ద రజకార్ల ఊచకోతకు 13 మంది అమరులయ్యారు. రంగాపురంలో ముగ్గురిని చెట్టుకు కట్టి కాల్చిచంపారు. దీంతో పరకాల ప్రాంతంలో రజకార్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు పోరాటం ఉధృతమైంది. ఇందులో భాగంగా రజకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ.. మరోవైపు నిజాంపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. నాడు తెలంగాణ సాయుధపోరాట యోధులు మందు గుండు సామగ్రి, తుపాకులు శత్రువులకు దొరకకుండా ఉండేందుకు గుట్టలపై దాచుకునేవారు. మహారాష్ట్రలోని చాందా (ముంబై) ప్రాంతంలో పరకాల ప్రాంతానికి చెందిన తెలంగాణ సాయుధపోరాట వీరులు బ్యాచ్‌ల వారీగా శిక్షణ పొందారు. సాయుధపోరాట యోధుడు కేవీ నర్సింగరావు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారిని రహస్యంగా చంద్రగిరి గుట్టలకు చేర్చేవారు. అక్కడి నుంచి సాయుధపోరాట యోధులు నిజాం పోలీసులకు చుక్కలు చూపించేవారు. ఎత్తయిన గుట్టల పైనుంచి శత్రువుల రాకను గమనించేవారు. దీంతో చంద్రగిరి గుట్టలు పోరాటాలకు అడ్డాగా పేరుగాంచాయి. హైదరాబాద్‌ స్టేట్‌లో కాంగ్రెస్‌ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తాలుకా కాంగ్రెస్‌ సేవా సమితి బాధ్యులు అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు. నాటి సమావేశాలకు లేఖల ద్వారానే సమాచారం అందజేసేవారు.

పరకాల పోరుగడ్డ బిడ్డలుగా చెప్పుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అందుకే నాటి తెలంగాణ సాయుధపోరాట యోధుల స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశాం. దేశశ భవిష్యత్‌ కోసం అన్యాయంపై ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలనే ఆలోచన పెరిగింది. – ఏకు శంకర్‌, పరకాల

తెలంగాణ సాయుధ పోరాటయోధులకు రహస్య స్థావరం

రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసిన ఉద్యమకారులు

చాందాలో శిక్షణ పొంది నిజాం సైన్యానికి చుక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement