కాళోజీ సెంటర్: పాఠశాలస్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు దేశంలోనే అతిపెద్ద సైన్‌్స్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) 2026–27’ నోటిఫికేషన్ విడుదలైంది. విజ్ఞానభారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజి యమ్స్, ఎన్‌్‌సీఈఆర్‌టీ సంయుక్తంగా ఈ జాతీయస్థాయి పరీక్షలు నిర్వహించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్ జి.రమేశ్ డీఈఓలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను పరీక్షకు సన్నద్ధం చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
లక్ష్యం ఇదే..
జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) 2020 లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి కలిగించడం, భారతదేశ ఘనమైన శాసీ్త్రయ వారసత్వాన్ని, ప్రపంచానికి మన శాస్త్రవేత్తలు అందించిన సహకారాన్ని నేటి తరానికి వివరించడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం.
పరీక్ష వివరాలు, అర్హతలు..
6వ తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష పూర్తిగా ఆన్‌న్‌లైన్‌లో ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు, హిందీతో పాటు దేశంలోని ప్రధాన ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసుకోవచ్చు. ప్రతి విద్యార్థి రిజిస్ట్రేషన్ ఫీజు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. http://vvm.org.inలో విద్యార్థులు సెప్టెంబర్ 30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
బహుమతులు, స్కాలర్‌షిప్‌లు..
ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర, జాతీయస్థాయిలో క్యాంపులు నిర్వహిస్తారు. జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి మరిన్ని అద్భుత అవకాశాలు లభిస్తాయి.
● భాస్కర స్కాలర్‌షిప్: జాతీయస్థాయి విజేతలకు ఏడాది పాటు నెలకు రూ.2,000 చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తారు.
● సృజన్ ఇంటర్న్‌షిప్ : దేశంలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలు ఇస్రో, డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్, బార్క్, ఐఐటీలో ఒకటి నుంచి 3 వారాల పాటు ఉచిత శిక్షణ, ఇంటర్న్‌షిప్ పొందే అవకాశం లభిస్తుంది. ప్రముఖ శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించేందుకు, జాతీయ ప్రయోగశాలలను సందర్శించే సువర్ణావకాశం దక్కుతుంది.
ఆన్‌లైన్ పరీక్షల టైంటేబుల్..
6, 7 తరగతి విద్యార్థులకు 16 నవంబర్ లేదా నవంబర్ 19న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. 8, 9 తరగతి విద్యార్థులకు 17 నవంబర్ లేదా 20న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 10, 11 తరగతి విద్యార్థులకు 18 నవంబర్ లేదా 21న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఏ విద్యార్థిని కూడా ఉదయం 10 గంటల కంటే ముందు లేదా సాయంత్రం 6 గంటల తర్వాత లాగిన్ కావడానికి అనుమతించరు. పరీక్షల షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు మొదటి రోజు లేదా రెండో రోజులో ఏదో ఒకసారి మాత్రమే లాగిన్ కావాలి.
విద్యార్థి సృజనాత్మక
ఆలోచనకు వేదిక
పాఠశాలస్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించడానికి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) 2026–27’ నోటిఫికేషన్ వేదిక. విద్యార్థులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేయడానికి 9848878455ను సంప్రదించవచ్చు. ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ పరీక్షలకు హాజరయ్యేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చొరవచూపాలి .
– డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి
6 నుంచి 11వ తరగతి
చదువుతున్న వారు అర్హులు
నమోదుకు చివరి గడువు
సెప్టెంబర్ 30వ తేదీ..
పరీక్షల్లో ప్రతిభ కనబరిస్తే స్కాలర్‌షిప్, ఇంటర్న్‌షిప్‌లకు ఎంపిక


