ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు సంగెం మండలంలోని ఎల్గూరురంగంపేటకు చెందిన శాబోత్ శ్రీనివాస్. ఇతడు జనవరి 2023న ఐదు ఎకరాల 30 గుంటల్లో ఆయిల్‌పామ్ సాగు చేశాడు. ఈ ఏడాది జనవరి నుంచి దిగుబడి ప్రారంభమైంది. ఒక చెట్టుకు 10 నుంచి 12 గెలలున్నాయి. ఇప్పటివరకు ఎకరాకు నాలుగున్నర టన్నుల చొప్పున దిగుబడి వచ్చింది. పర్వతగిరి మండలం ఏనుగల్ వద్ద ఆయిల్‌పామ్ పికప్ సెంటర్ వారికి టన్నుకు రూ.23,758 ధరకు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఎకరానికి ఖర్చులు పోను ఏడాదికి రూ.లక్ష మిగులుతాయంటున్నాడు.
సాక్షి, వరంగల్: వంటనూనెల దిగుమతి తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఎకరాకు రూ.50,918 రాయితీ, టన్ను ధర రూ.23,758 ఉన్నా జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గిపోతోంది. నాలుగేళ్లలో కొత్తసాగు 80 శాతానికి పైగా తగ్గడం ఉద్యానశాఖకు పెద్ద సవాల్‌గా మారింది. గతేడాది నుంచి దిగుబడి సాధిస్తున్న రైతుల విజయగాథలను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడంలో అధికారులు చొరవ చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా అ నుకూల భూమి ఉన్నా ఇప్పటివరకు కేవలం 6,722 ఎకరాల్లో మాత్రమే సాగు ఉండడం గమనార్హం.
ఇప్పటివరకు 1,185 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు..
నర్సంపేట, పర్వతగిరి మండలం ఏనుగల్, వర్ధన్నపేట ప్రాంతాల్లో ఉన్న ఆయిల్‌పామ్ కలెక్షన్ సెంటర్ ద్వారా ప్రతి 15 రోజులకోసారి గెలలు కొనుగోలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి జిల్లాలో ఉన్న రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు గెలలు తరలిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 2,600 ఎకరాల విస్తీర్ణంలో 1, 185 మెట్రిక్‌టన్నుల గెలలు కొనుగోలు చేసి 491 మంది రైతులకు రూ.2.55 కోట్లు చెల్లించారు. ఎకరాకు సగటున దిగుబడి 6 మెట్రిక్ టన్నులు వస్తోంది. ప్రస్తుతం టన్ను ధర రూ.23,758గా ప్రభుత్వం నిర్దేశించింది. మూడేళ్లుగా ఆయిల్‌పామ్ సాగు చేసే రైతుల సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వాలు ఇచ్చే రా యితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు సూచిస్తున్నారు.
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం లెక్క
ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నా
ఆసక్తి చూపని రైతులు
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 508 ఎకరాల్లోనే పంట
ఉద్యానశాఖ అవగాహన కల్పిస్తేనే
చేరనున్న లక్ష్యం
ఎకరాకు లభించే రాయితీ (రూపాయల్లో)
మొక్కల కొనుగోలు 11,600
ఒకటో సంవత్సరం సాయం 2,100
రెండో సంవత్సరం సాయం 2,100
మూడో సంవత్సరం సాయం 2,100
నాలుగో సంవత్సరం సాయం 2,100
అంతర పంటల ప్రోత్సాహకం (4 ఏళ్లు) 8,400
డ్రిప్ ఇరిగేషన్ 22,518
మొత్తం 50,918


