● డీఈఓ రంగయ్యనాయుడు
కాళోజీ సెంటర్: ఉపాధ్యాయులు ఏఐ ఆధారిత బోధనా విధానాలను అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్యనాయుడు సూచించారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శంభునిపేట, కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘స్పెల్–2’ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ–2020) లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి విద్యార్థిలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్ర (ఎఫ్‌ఎల్‌ఎన్) నైపుణ్యాలను పెంపొందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఏఐ–డిజిటల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థుల అభ్యసనస్థాయిని అంచనా వేయాలని, గణితం, సైన్‌న్స్ బోధనలో ‘ఖాన్ అకాడమీ’ డిజిటల్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం, ‘ఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’లోని బోధనా పద్ధతులను అధ్యయనం చేసి తరగతి గదుల్లో అమలు చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరును ప్రతిరోజూ సకాలంలో నమోదు చేయాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్‌తేజ మాట్లాడుతూ సాంకేతికవనరులు, ఏఐ ఆధారిత బోధనతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, ఉల్లాస్ కోఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు, మాస్టర్ ట్రైనర్లు, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


