కాశిబుగ్గ: ‘నోటి మాట.. నోటు వాటా’ శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వరంగల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ గాంధీనగర్‌లోని 107 సర్వే నంబర్ ప్రభుత్వ స్థలంలోని నిర్మాణాలను శనివారం టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఈ స్థలంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనిపై స్థానిక కాంటెస్ట్ కార్పొరేటర్ మంతెన అమరేశ్ పలుమార్లు మున్సిపల్ కమిషనర్, గీసుకొండ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగాయి. మళ్లీ ఫిర్యాదు చేయడంతో అధికారులు పోలీసుల సమక్షంలో రెండుసార్లు నోటీసులు అందించారు. ఈ ఇంటి నిర్మాణ విషయంలో మున్సిపల్ అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేసినప్పటికీ వారు నిబంధనల ప్రకారం సర్వే చేయాలని ఆదేశించారు. చివరకు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సీపీ ఉపేక్షించకుండా అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ఆదేశించారు. కాగా, ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగపడేలా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.


