చకచకా ఫార్మర్‌ రిజిస్ట్రీ | - | Sakshi
Sakshi News home page

చకచకా ఫార్మర్‌ రిజిస్ట్రీ

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

నెక్కొండ: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్‌ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే భూములు, రైతుల లెక్క పక్కాగా తేలనుంది. పట్టా పాస్‌పుస్తకాల వివరాలను రైతు ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేయడం ద్వారా ఫార్మర్‌ ఐడీ కేటాయిస్తున్న విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా రైతులకు చేరాలనే లక్ష్యంతో ఆధార్‌ మాదిరిగా భూములకు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయిస్తున్నారు.

అత్యధికం నెక్కొండ..

అత్యల్పం ఖిలా వరంగల్‌

జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ 72.41 శాతమే పూర్తయ్యింది. 1,62,619 మంది రైతులు ఉండగా 1,17,747 మంది రైతులు మాత్రమే ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకున్నారు. ఇంకా 44,872 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో అత్యధికంగా నెక్కొండ మండలంలో 80.99 శాతం, అత్యల్పంగా ఖిలా వరంగల్‌ మండలంలో 64.38 శాతం నమోదు చేసుకున్నారు.

పథకాలకు ప్రామాణికం..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలకు ఫార్మర్‌ రిజిస్ట్రీని రానున్న రోజుల్లో ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ వంటి పథకాలకు అనుసంధానం చేయనున్నారు. విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించడం వల్ల భూమికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని అధికారులు చెబుతున్నారు. భూయజమాని స్థానం, విస్తీర్ణం, భూమి ఉపయోగాన్ని నిర్ధారించడమే కాకుండా అక్రమ కట్టడాలను నివారించడానికి దోహదపడనుంది. భూమి బ్యాంకింగ్‌, బీమా వ్యవస్థలతో సులభంగా అనుసంధానం చేయడానికి వీలవుతుంది. భూయజమానికి హక్కులను గుర్తించడమే కాకుండా భూ వివాదాలను నిరోధించి, పారదర్శకత పెంపొందించేందుకు, భూవివరాలను డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం చేయడం సులభతరం కానుంది.

జిల్లాలో ఇప్పటివరకు 72.41 శాతం

మొత్తం రైతులు 1,62,619 మంది

నమోదు చేసుకున్నది 1,17,747 మంది

ఆధార్‌ మాదిరిగా భూములకు

విశిష్ట గుర్తింపు సంఖ్య

మండలం రైతులు రిజిస్ట్రేషన్‌

చేసుకున్న రైతులు

నెక్కొండ 19,094 15,465

రాయపర్తి 20,251 15,393

వర్ధన్నపేట 14,655 11,057

గీసుకొండ 14,124 10,390

పర్వతగిరి 14,339 10,387

చెన్నారావుపేట 8,292 5,870

సంగెం 16,315 11,450

దుగ్గొండి 14,851 10,369

నర్సంపేట 12,636 8,741

ఖానాపురం 8,693 5,926

నల్లబెల్లి 14,049 9,274

ఖిలా వరంగల్‌ 5,320 3,425

మొత్తం 1,62,619 1,17,747

నమోదు చేసుకోవాలి..

జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రీ కొనసాగుతోంది. క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణాధికారులు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రైతులు ఏఈఓలకు వివరాలు అందించి విశిష్ట గుర్తింపు కార్డు నంబర్‌ పొందాలి. రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలి. మీసేవ కేంద్రాల్లోనూ రైతుల వివరా నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. పూర్తిస్థాయిలో రిజిస్ట్రీకి రైతులు సహకరించాలి.

– విజయనిర్మల, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement