ఆరుతడి పంటలు సాగుచేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగుచేయాలి

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

దుగ్గొండి గ్రామ సభలో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

దుగ్గొండి: ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో చేతికి వచ్చే పంటలు సాగు చేసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. వర్షాలు 15 రోజులు ఆలస్యమైతే పత్తి, వరి పంటల జోలికి వెళ్లకుండా ప్రణాళికాబద్ధంగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో శనివారం సర్పంచ్‌ కామిశెట్టి ప్రశాంత్‌ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున గ్రామాల్లో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్‌ సమ్మక్కను ఆదేశించారు. అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని సర్పంచ్‌ కామిశెట్టి ప్రశాంత్‌ కోరగా ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్‌ సమ్మక్క, ఎంపీడీఓ అరుంధతి, ఏఈఓ హనుమంతు, ఉపసర్పంచ్‌ పల్లె వైష్ణవిశ్యాం తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు వివరించాలి

కాళోజీ సెంటర్‌: జయశంకర్‌ బడిబాట–2026 కార్యక్రమంలో భాగంగా లక్ష్యాన్ని మించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటింటా ప్రచారం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించాలని సూచించారు. ఏఐ ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఖాన్‌ అకాడమీ, ఫిజిక్స్‌ వాలా వంటి డిజిటల్‌ విద్యా వనరులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల నమోదు పెంపునకు భవిత కేంద్రాలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, ఇంటర్‌ పూర్తిచేసిన వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడిబాటలో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులకు ప్రభుత్వం విదేశీ పర్యటన అవకాశం కల్పించనుందని కలెక్టర్‌ తెలిపారు. జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలను గుర్తించి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ నిర్వహించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, డీఈఓ రంగయ్యనాయుడు, డీఐఈఓ శ్రీధర్‌ సుమన్‌ పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కాళోజీ సెంటర్‌: డీఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేయుటకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రంగయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌, ఖిలా వరంగల్‌, గీసుగొండ (గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి) మండలాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల సీనియర్‌ గెజిటెడ్‌ హెచ్‌ఎంలు–గ్రేడ్‌2 గల వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు డీఈఓ కార్యాలయంలో అందించాలని సూచించారు. ఈ అదనపు బాధ్యతలు తమ సాధారణ విధులతోపాటు నిర్వర్తించాలని, ఈ సేవలకు ఎటువంటి అదనపు జీతభత్యాలు ఉండవని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలకు పైబడి ఉద్యోగ విరమణకు సర్వీస్‌ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని డీఈఓ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement