● పల్లెల్లో 50 నుంచి 70 శాతం పెరుగుదల
● నగరంలోనూ 50 నుంచి 100 శాతం వరకు..
● భూయజమానులకు లాభం..
కొనుగోలుదారులకు భారం
● నేటి నుంచి పెరిగిన మార్కెట్ విలువ
ప్రకారమే రిజిస్ట్రేషన్లు
సాక్షి, వరంగల్: జిల్లాలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూముల విలువ రూ.లక్షల నుంచి ఆపైకి పెరగనున్నాయి. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 నుంచి 70 శాతం వరకు, వ్యవసాయేతర భూముల విలువ కూడా 30 నుంచి 100 శాతానికి పెరగనుంది. దీనివల్ల భూయజమానులకు ఆస్తి అధికారిక విలువ పెరగడంతోపాటు బ్యాంకు రుణాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. భూసేకరణ పరిహారం సమయంలో నష్టపరిహారం అధికంగా రావడం కలిసిరానుంది. అదే సమయంలో భూమి కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గడంతో రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు తగ్గే చాన్స్ ఉంది. కొనుగోలుదారులకు రూ.వేల నుంచి లక్షల రూపాయల వరకు అదనపు భారం పడనుంది. శుక్రవారం నుంచే ఈ పెరిగిన ధరల మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ రుసుం చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు వెళ్లనుంది. ఈ పెంపుతో ప్రభుత్వానికి అదనంగా రూ.కోట్లలో ఆదాయం రానుంది.
సిటీలో ధరల దూకుడు..
వరంగల్, ఖిలా వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల ధరలు 50 శాతం నుంచి 100 శాతానికి పెరిగాయి. మామూనూరులో ప్రస్తుతం ప్రభుత్వపరంగా గజం రేటు రూ.1500 నుంచి రూ.2500 ఉంటే అదీ రూ.4000 నుంచి రూ.5000 వరకు పెరిగింది. ఎందుకంటే ఇక్కడ విమానాశ్రయ భూములను సేకరించిన ప్రభుత్వం గజానికి రూ.4,887కు ధర చెల్లించిన సంగతి తెలిసిందే. అత్యధికంగా వరంగల్ ఎస్‌వీఎన్, జేపీఎస్ రోడ్డులో ప్రస్తుతం గజానికి రూ.29,400 ఉంటే రూ.44,900 పెరిగింది. అలాగే, అపార్ట్‌మెంట్లకు 20 శాతం పెరిగింది. లక్ష్మీపురంలో రూ.4,100 నుంచి రూ.8,200 వరకు పెరిగింది. వరంగల్ కేఎస్‌ఎన్ గార్డెన్ సమీపంలో రూ.3100 నుంచి రూ.6,200, కాకతీయ మెగాటైక్స్‌టైన్ పార్కు సమీపంలో రూ.900 నుంచి రూ.1,800 వరకు పెరిగింది. నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు అయ్యప్ప టెంపుల్ సమీపంలో గజానికి రూ.2400 నుంచి రూ.3,100 ఉన్న విలువ రూ.4,100 నుంచి రూ.5,300 వరకు పెరిగింది. వర్ధన్నపేటలోే ఓపెన్ ప్లాట్లు గజానికి రూ.1700 ఉంటే 2600, కమర్షియల్ రూ.4,100 ఉంటే రూ.6,200 వరకు పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ తగ్గేదేలే..
వర్ధన్నపేట బండౌతపూర్, దమ్మన్నపేట, రామవరం, దివిటిపల్లి, కొత్తపల్లి, నల్లబెల్లి, ఉప్పరపల్లి గ్రామాల్లో ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.2,92,500 ఉండగా రూ.5,11,875లకు పెరిగింది. అలాగే, వర్ధన్నపేట, ఇల్లందలో ఎకరానికి రూ.4,50,000 ఉండగా రూ.7,87,500కు చేరనుంది. రాయపర్తి మండలంలోనూ కొన్ని గ్రామాల్లో ఎకరానికి రూ.2,92,000 ఉండగా రూ.3,80,000కు పెరిగింది. సంగెం మండలంలో ఎకరాకు రూ.9 లక్షలుంటే రూ.13,50,000కు పెరిగింది. ముఖ్యంగా వరంగల్, ఖిలా వరంగల్‌లో వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల మధ్య ధర ఉండే అవకాశముంది. వ్యవసాయ భూముల ధరలు 50 నుంచి 70 శాతం వరకు పెరగనుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎకరం వ్యవసాయ భూమికి ఇలా..
పాత విలువ
రూ.10 లక్షలు
కొత్త విలువ (50% పెంపు)
రూ.15 లక్షలు
రిజిస్ట్రేషన్ వ్యయం (7.5%)
పాత విలువ
రూ.75,000
కొత్త విలువ
రూ.1,12,500
వివరాలు పాత రేటు కొత్త రేటు
గజానికి మార్కెట్ విలువ రూ.10,000 రూ.15,000
ప్లాట్ 200 గజాలు రూ.20 లక్షలు రూ.30 లక్షలు
మార్కెట్ విలువలో పెరుగుదల : రూ.10 లక్షలు
రిజిస్ట్రేషన్ చార్జీలు సుమారు
7.5 శాతంగా తీసుకుంటే
అదనపు రిజిస్ట్రేషన్ భారం : రూ.75,000


