● భూముల మార్కెట్ విలువ సవరణ ఎఫెక్ట్
● ఫలితంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు తాకిడి
సాక్షి, వరంగల్: భూముల మార్కెట్ విలువలను సవరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు ఒక్కసారిగా ఊపు వచ్చింది. పెరిగిన ధరలు అమల్లోకి రాకముందే పాత రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు కొనుగోలుదారులు, భూ యజమానులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు భారీగా తరలివచ్చారు. ఫలితంగా ఈ నెల ఒకటి నుంచి నాలుగు వరకు జిల్లాలోని నాలుగు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మొత్తం 748 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధిక రిజిస్ట్రేషన్లు వరంగల్, ఖిలా వరంగల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరిగాయి. ఈ రెండు కార్యాలయాల్లో కలిపి 578 రిజిస్ట్రేషన్లు నమోదుకావడం గమనార్హం. నగర ప్రాంతాల్లో భూములు, ప్లాట్ల కొనుగోలు విక్రయాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ రద్దీ నెలకొంది. నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం తర్వాత స్థానం, వర్ధన్నపేట కార్యాలయంలో అత్యల్ప రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అయితే ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించింది. కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ వ్యయం పెరిగే అవకాశం ఉండటంతో చాలా మంది ముందస్తుగా లావాదేవీలు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల వెంట ఉన్న భూముల కొనుగోలు విక్రయాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నాలుగు రోజుల్లోనే రూ.కోట్లలో ఆదాయం వచ్చి చేరింది.
రోజుకు సగటున 187 రిజిస్ట్రేషన్లు..
మార్కెట్ విలువల పెంపు ప్రకటన అనంతరం కేవలం నాలుగు రోజుల్లోనే 748 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. అంటే రోజుకు సగటున 187 రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాధారణ రోజులతో పోలిస్తే గణనీయమైన రద్దీ కనిపించింది.
సబ్ రిజిస్ట్రార్ ఏప్రిల్ మే జూన్
కార్యాలయం
వరంగల్ 568 943 369
ఖిలా వరంగల్ 602 904 209
నర్సంపేట 635 587 150
వర్ధన్నపేట 160 198 20
మొత్తం 1,965 2,632 748
అదనపు రుసుం చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్..
ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్‌దారులు, సవరించిన మార్కెట్ విలువల ప్రకారం వర్తించే అదనపు రుసుము (డెఫిసిట్ చలాన్)ను రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెల్లించాలి. ఈ అదనపు రుసుము చెల్లించిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని రాష్ట్ర రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ (రిజిస్ట్రేషన్.తెలంగాణ.జీఓవీ.ఇన్)లో ప్రకటన ఇచ్చారని జిల్లా రెవెన్యూ అధికారులు తెలిపారు.


