నల్లబెల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మేడపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొన్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు గ్రామ సభలో వివిధ శాఖల అధికారులు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలను ప్రజలకు వివరించారు. తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ అర్రెం సాంబయ్య, మేడపల్లి వైద్యాధికారి జ్యోతి, ఏపీఓ వెంకట్‌నారాయణ, పంచాయతీ కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ షాపులో టాస్క్‌ఫోర్స్ దాడి
నల్లబెల్లి: గడువు ముగిసిన పురుగు మందులను రైతులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగాపురంలోని విజయదుర్గ ఫర్టిలైజర్ షాపులో టాస్క్‌ఫోర్స్ అధికారులు గరువారం దాడులు చేశారు. గడువు ముగిసిన రూ.2.32 లక్షల విలువైన పురుగు మందులను అధికారులు సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత స్థానిక ఎస్సై సాయిప్రసన్న కుమార్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఎస్సై భానుప్రకాశ్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసే పురుగు మందుల గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ బన్న రజిత పాల్గొన్నారు.
మిల్లులకు ధాన్యాన్ని తరలించాలి
ఖానాపురం: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని డీసీఓ సంజీవరెడ్డి సూచించారు. ఈ మేరకు బుధరావుపేట, ఖానాపురంలోని కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా లారీల కొరతపై కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. లారీలను పెంచాలని తెలిపారు. ట్రాక్టర్లతోనైనా రైతులు మిల్లులకు తరలించుకోవాలని సూచించారు. సీఈఓ ఆంజనేయులు, సిబ్బంది రాజు, వినయ్ పాల్గొన్నారు.
ఐదుగురు ఉద్యోగుల బదిలీ
కాశిబుగ్గ: వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఒకేసారి ఐదుగురు ఉద్యోగులు బదిలీ అయ్యారు. సీనియర్ అసిస్టెంట్ ప్రణీత్ నర్సంపేటకు బదిలీ కాగా.. ఈ స్థానంలో ఇంకా ఎవరూ రాలేదు. అలాగే, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ అవినాష్ పర్వతగిరికి బదిలీ కాగా ఈ స్థానంలో పర్వతగిరి నుంచి భారతి వచ్చారు. అలాగే, వర్ధన్నపేటకు చెందిన ఆర్‌ఐ కృష్ణస్వామి వరంగల్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తూ బదిలీ అయ్యారు. ఈ స్థానంలో ఖిలా వరంగల్ నుంచి కీర్తన్ బదిలీపై వచ్చారు. సర్వేయర్ సందీప్‌కుమార్ ఖిలా వరంగల్‌కు బదిలీ కాగా, ఈ స్థానంలో చెన్నారావుపేట నుంచి విద్యశ్రీ వచ్చారు.
10న చెస్ ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 10న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ –9 చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ, రెడ్డికాలనీలోని మాస్టర్‌జీ (వికాస్) హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.


