● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
● రెండు జిల్లాల అధికారులతో సమీక్ష
హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మరింత వేగంగా పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సూచించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, డీఆర్డీఓలు మేన శ్రీను, నాగ పద్మజతో పాటు సంబంధిత శాఖల అధికారులతో డెయిరీ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్‌లోని సెర్ప్ కార్యాలయంలో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఏడీడీబీ) అధికారులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. పరకాల మహిళా డెయిరీ పరిధి హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆరు మండలాలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. డెయిరీ అభివృద్ధి ద్వారా గ్రామీణ మహిళలకు స్థిర ఆదాయ వనరులు లభించడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద మాట్లాడుతూ డెయిరీ అభివృద్ధికి అవసరమైన చర్యలను అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారులు రాధాకిషన్, బాలకృష్ణ, అడిషనల్ డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎంలు సరిత, వరలక్ష్మి, మెప్మా కో–ఆర్డినేటర్లు రజిత రాణి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


