భూసేకరణపై రైతులతో ఆర్బిట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

భూసేకరణపై రైతులతో ఆర్బిట్రేషన్‌

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

న్యూశాయంపేట: ఎన్‌హెచ్‌–163 (జి) భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన గీసుకొండ మండలం మచ్చాపూర్‌ రైతులతో బుధవారం కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆర్బిట్రేషన్‌ నిర్వహించారు. రైతుల అభ్యంతరాలు, పరిహారం తదితరల అంశాలపై కలెక్టర్‌ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, గీసుకొండ తహసీల్దార్‌ రియాజుద్దీన్‌, అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీఓగా రంగారావు బాధ్యతల స్వీకరణ

ఖిలా వరంగల్‌: జిల్లా రవాణా శాఖ అధికారి (ఆర్టీఓ)గా పి.రంగారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులను బదిలీ చేసిన విషయం విధితమే. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఆర్టీఓగా విధులు నిర్వర్తిస్తున్న రంగారావు వరంగల్‌ జిల్లాకు బదిలీ చేయగా బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనచోదకులకు మెరుగైన సేవలందిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎంవీఐ జె. శ్రీనివాస్‌, ఏఓ జి. సుభాషిణీ, సీనియర్‌ అసిస్టెంట్‌ సీహెచ్‌.నవీన్‌, ఏఎంవీఐలు ఎం.శంకర్‌, ఎస్‌.నిహారిక బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్టీఓ రంగారావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

నర్సరీని బాధ్యతగా నిర్వహించాలి

సంగెం: పర్యావరణ పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని, వాటిని బాధ్యతగా నిర్వహించాలని డీఆర్‌డీఓ నాగపద్మజ అన్నారు. బుధవారం మండలంలోని మొండ్రాయి గ్రామ నర్సరీని సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనంతో ఉండాలంటే నాణ్యమైన మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ గణేష్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ రమేష్‌ పాల్గొన్నారు.

కాస్త ఉపశమనం..

నర్సంపేట: మండే ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే విధంగా బుధవారం జిల్లాలో తొలకరి వర్షం పులకరించింది. మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్ల బడింది. ఆకాశం మేఘావృతమై నర్సంపేట, వరంగల్‌, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. నెల రోజుల పాటు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో జిల్లాలో అనేక మంది వడదెబ్బతో మృతి చెందారు. దీంతో పాటు మండిన ఎండలకు పంట పొలాలు కూడా దగ్ధమై భారీగా నష్టం వాటిల్లింది. బుధవారం కురిసిన చిరు జల్లులతో ప్రజలు ఉపశయనం పొందారు.

Advertisement
 
Advertisement
Advertisement