కాశిబుగ్గ: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ ఎంజీఎంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం చైర్‌పర్సన్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్, వైద్య పరికరాలు, నర్సింగ్ పాఠశాల, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభంపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్ సిబ్బంది పోస్టులు, అత్యవసర విభాగంలో రద్దీ, ఆధునిక వైద్య పరికరాలు, పెండింగ్ బిల్లులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ సమస్యలను అధికారులు మంత్రి సురేఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పేదరోగులకు నాణ్యమైన వైద్యమందించాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న నర్సింగ్ స్కూల్ భవనం, పరికరాల మరమ్మతులు, సిబ్బంది భర్తీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ కడియ కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులు ఆస్పత్రి అభివృద్ధికి తమ నిధులనుంచి రూ.50లక్షలు చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్ అశ్విన్‌కుమార్,జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, డాక్టర్ అనిల్ బాలరాజు, డాక్టర్ రామ్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, అభివృద్ది కమిటీ సభ్యులు వనపర్తి శ్రీనివాస్, కన్నోజు లావణ్య, రాజ్‌కమల్, లత, పాల్గొన్నారు. కాగా, ఈ అభివృద్ది కమిటీ సమావేశం 2018 సంవత్సరంలో జరగగా మళ్లీ 8 ఏళ్ల తర్వాత నిర్వహించారు. సమావేశం అనంతరం ఎంజీఎం ఆసుపత్రిలోని ఎఎంసీ కేర్ సెంటర్‌లను మంత్రి సురేఖ సందర్శించి, రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
నాలుగైదు నెలల్లో సూపర్ స్పెషాలిటీ
ఆస్పత్రి సిద్ధం : మంత్రి కొండా సురేఖ
వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు నాలుగైదు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం ఆమె ఎంజీఎంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎంజీఎంలో రోగులకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోకి మార్చిన తర్వాత ఇందులోనే కార్డియాలజీ, న్యూరోసర్జరీ విభాగాలను ఉంచాలని సూచించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ ఏజెన్సీ గడువు ముగిసిందని, వేరే ఏజెన్సీని నియమిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో ఎవరైన సిబ్బంది డబ్బులు అడిగితే సస్పెండ్ చేయాలని, ప్రజలు ఇలాంటివారి గురించి కలెక్టర్, సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎదైనా చెప్పుకోలేని సమస్య ఉంటే రాతపూర్వకంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలని పేర్కొన్నారు. వీరిని గుర్తించడానికి ప్రత్యేకంగా ఓ సూపర్‌వైజర్‌ను నియమించాలని ఆదేశించారు. అలుమిని డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి విరాళాలు పోగుచేసి ఆస్పత్రి అభివృద్ధికి ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఎంజీఎం అభివృద్ధి కమిటీ సమావేశంలో
మంత్రి కొండా సురేఖ


