జెండాకు వందనం చేస్తున్న మంత్రి కొండా సురేఖ, చిత్రంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులు
సాక్షి, వరంగల్: అభివృద్ధిలో జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఖిలావరంగల్‌లోని ఖుష్‌మహల్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పతాకావిష్కరణ చేసి జిల్లా ప్రగతిని మంత్రి కొండా సురేఖ వివరించారు.
3.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు..
జిల్లాలో 260 కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్, యాసంగి సీజన్లలో సుమారు 3.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.913 కోట్లకు పైగా జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల ద్వారా మరో రూ.303 కోట్లు, రైతు భరోసా కింద 1.59 లక్షల మంది రైతులకు రూ.118.70 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు.
9,483 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..
మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 6.58 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందారని, గృహజ్యోతి పథకం ద్వారా 1.34 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 9,483 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 1,793 ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు.
సాగునీరందించేందుకు ప్రణాళికలు..
సాగునీటి రంగంలో 2.93 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని మంత్రి వెల్ల డించారు. పాకాల, దేవాదుల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, ఉపాధి హామీ పథకం కింద 9.12 లక్షల పనిదినాలు కల్పించి రూ.21.94 కోట్ల వేతనాలు చెల్లించామని ఆమె వివరించారు.
రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి..
వరంగల్ హెల్త్ సిటీ అభివృద్ధిలో భాగంగా రూ.1,100 కోట్లతో 2,100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 69 వేల మందికి పైగా వైద్య సేవలు అందించామని వెల్లడించారు.
ఇందిరా మహిళా శక్తి ద్వారా 59 భవనాల నిర్మాణం
ఇందిరా మహిళా శక్తి పథకం కింద 59 గ్రామ సంఘాల భవనాల నిర్మాణానికి 10 లక్షల చొప్పున రూ. 5.90 కోట్లు కేటాయించామని తెలిపారు. జిల్లాలో 9,669 మంది మహిళా సభ్యులతో రూ. 40.67 కోట్లు వెచ్చించి చిన్నచిన్న వ్యాపారాలు ఏర్పాటు చేయించినట్లు వివరించారు. 555 స్వశక్తి మహిళా సంఘాలకు రూ.37.42 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, రూ.48.54 కోట్ల సీ్త్రనిధి రుణాలు మంజూరు చేశామని తెలిపారు. స్నేహ గ్రూప్స్ ద్వారా 11 మంది విద్యార్థినులకు సైకిళ్లు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరుపత్రాలు, 102 మహిళా సంఘాలకు రూ.12 కోట్ల రుణాల చెక్కులు అందించారు. చెన్నారావుపేట కేజీబీవీ విద్యార్థినులు చేసిన సాసోకి.. సరగం స్వాగతం పాట ఆకట్టుకుంది.
చివరి దశకు పాకాల పనులు..
అటవీ పరిరక్షణలో భాగంగా 31.40 లక్షల మొక్కలు నాటామని, పాకాల ఎకో టూరిజం అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయని మంత్రి వెల్లడించారు. ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీసీపీ అంకిత్‌కుమార్, డీఎఫ్‌ఓ నిఖిత, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు.
జిల్లాలో 1.59 లక్షల మంది రైతులకు రూ.118.70 కోట్ల రైతు భరోసా
సంక్షేమం, సదుపాయాల కల్పనలో రాష్ట్రం పురోగతి
రాష్ట్ర అవిర్భావ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ
ఖిలా వరంగల్ ఖుష్ మహల్‌లో పతాకావిష్కరణ
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా టెక్స్‌టైల్ పార్కు, మామునూరు విమానాశ్రయ విస్తరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారి–163జీ పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్‌లో మాస్టర్‌ప్లాన్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు.
పురోగతిలో
అభివృద్ధి పనులు..


