ఖిలా వరంగల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మూడేళ్లుగా ఖాళీగా ఉన్న వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీకి మంగళవారం నూతన పాలకవర్గాన్ని ప్రకటించింది. చైర్‌పర్సన్‌గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్‌గా బండి జనార్దన్‌ను నియమించినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెట్, సహకార శాఖ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. వరంగల్ మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిందని పేర్కొన్న ఆయన నూతన పాలకవర్గం స్థానిక రైతుల సమస్యల పరిష్కారంలో చురుకై న పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్కెట్ కార్యదర్శిగా శ్రీనివాస్..
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా ఎన్.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న మల్లేశం జమ్మికుంటకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీపీ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాన్స్‌జెండర్లకు చెక్కుల పంపిణీ
కాళోజీ సెంటర్: స్వయం ఉపాధి పథకం కింద జిల్లాలో అర్హులైన 8 మంది ట్రాన్స్‌జెండర్లకు రూ.75 వేల చొప్పున రూ.6 లక్షల చెక్కులను మంత్రి కొండా సురేఖ పంపిణీ చేసినట్లు జిల్లా సంక్షేమాధికారి రాజమణి తెలిపారు. ఆర్థిక పునరావాస పథకం కింద అర్హులైన ట్రాన్స్‌జెండర్లకు 100 శాతం సబ్సిడీ కింద పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎద్దు నక్షత్ర, బండారి వీణ(శారీ సెంటర్), ఓరుగంటి ప్రియాంక, ఎదునూరి సుప్రజ (కిరాణా షాప్), ఓరుగంటి అశ్విని, జూలూరి శశి (బొటిక్), ఓరుగంటి స్నేహ (టీ స్టాల్), ఓరుగంటి సుధ (కూరగాయల దుకాణం) ఉన్నారని పేర్కొన్నారు.
అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
న్యూశాయంపేట: అభివృద్ధి, సంక్షేమాన్ని గ్రామసభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక చివరి దశకు చేరుకుందని, సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, అధికారులు పాల్గొన్నారు.
పర్యాటకులను ఆకట్టుకునేలా సుందరీకరణ
నయీంనగర్: వరంగల్ కోట పరిసరాలను, చారిత్రక అగడ్త అభివృద్ధి పనులను ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ కోట చుట్టూ ఉన్న అగడ్త రక్షణ, సుందరీకరణ పనుల పురోగతిపై అధికారులతో కలిసి ‘కుడా’ చైర్మన్ సమీక్షించారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన చాపర్తి రమేశ్(45) అనే రైతు అప్పుల బాధతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సుమలత కథనం ప్రకారం.. రమేశ్ తన 20 గుంటల సొంతభూమితో పాటు మరో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆశించిన రీతిలో పంటలు సరిగా పండకపోవడం, పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో సుమారు రూ.15 లక్షల మేర అప్పులు చేశాడు. అప్పులభాధ భరించలేక తీవ్ర నిరాశ, మనోవేదనలో ఉన్న అతను సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తన వ్యవసాయ భూమి వద్ద గడ్డిమందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని పక్క చేను రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అదే రోజు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం తెల్ల వారుజామున చికిత్స పొందుతూ రమేశ్ మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.


