అమరవీరులకు సీపీ నివాళి | - | Sakshi
Sakshi News home page

అమరవీరులకు సీపీ నివాళి

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

అమరవీరులకు సీపీ నివాళి ‘సీకేఎం’లో అంబులెన్స్‌లకు డీజిల్‌ కొరత పర్యాటకులను ఆకట్టుకునేలా సుందరీకరణ

వరంగల్‌ క్రైం: హనుమకొండ అదాలత్‌ సెంటర్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను మరవొద్దని, వారి ఆశయ సాధనకు మనమందరం కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కాశిబుగ్గ: వరంగల్‌ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని అంబులెన్స్‌లకు డీజిల్‌ కొరత ఏర్పడింది. మూడు రోజుల నుంచి ఇదే దుస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీఎం, కేఎంసీలోని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, టూడీఈకో పరీక్షల కోసం తీసుకెళ్లే అంబులెన్స్‌లకు డీజిల్‌ లేదని చెబుతూ చేతులెత్తేస్తున్నారని రోగుల అంటెండెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రికి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలు ప్రైవేట్‌ వాహనాల్లో డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తోందని అటెండెంట్లు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్‌లు ఆగిపోతే వైద్యసేవలు ఎలా అందుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అంబులెన్స్‌లను నడిపించాలని కోరుతున్నారు.

నయీంనగర్‌: వరంగల్‌ కోట పరిసరాలను, చారిత్రక అగడ్త అభివృద్ధి పనులను ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్‌ కోట చుట్టూ ఉన్న అగడ్త రక్షణ, సుందరీకరణ పనుల పురోగతిపై అధికారులతో కలిసి ‘కుడా’ చైర్మన్‌ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటకులను ఆకట్టుకునేలా అగడ్తను తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, అధికారులు, ఇంజనీరింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఏనుమాముల మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా ప్రియాంక

వైస్‌ చైర్మన్‌గా బండి జనార్దన్‌

ఖిలా వరంగల్‌: రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మూడేళ్లుగా ఖాళీగా ఉన్న వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి మంగళవారం నూతన పాలకవర్గాన్ని ప్రకటించింది. చైర్‌ పర్సన్‌గా ఎర్ర ప్రియాంక, వైస్‌ చైర్మన్‌గా బండి జనార్దన్‌ను నియమించినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెట్‌, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. వరంగల్‌ మార్కెట్‌ కమిటీ రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిందని పేర్కొన్న ఆయన నూతన పాలకవర్గం స్థానిక రైతుల సమస్యల పరిష్కారంలో చురుకై న పాత్ర పోషిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది జనవరిలో కమిటీని నియమించగా కొన్ని కారణాలతో హోల్డ్‌లో పెట్టారు.

ఏనుమాముల మార్కెట్‌ కార్యదర్శిగా శ్రీనివాస్‌

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శిగా ఎన్‌.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న మల్లేశం జమ్మికుంటకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీపీ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement