కాశిబుగ్గ: జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.యజ్ఞనారాయణ మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు (మంగళవారం) ఈ సేవా పతకాన్ని అందజేయనున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ పతకానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా యజ్ఞనారాయణకు అగ్నిమాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరణ
న్యూశాయంపేట: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి 12వ తే దీ వరకు చేపట్టే పర్యావరణం పరిరక్షణ ప్రత్యేక కార్యాచరణపై ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ నిఖిత, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ. గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
విద్యుత్ మోటార్ల చోరీ!
నల్లబెల్లి: మండలకేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు ఎస్సారెస్పీ కాల్వ వద్ద ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు, వైర్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానిక రైతుల్లో ఆందోళన రేకెత్తించింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి గ్రామానికి చెందిన వేముల రాజు, ఉడుత బాబు, పిట్టల సుదర్శన్, మార్తా సాంబయ్య అనే రైతులు తమ పంట పొలాలకు సాగు నీరు అందించేందుకు ఎస్సారెస్పీ కాల్వ వద్ద విద్యుత్ మోటార్లను అమర్చుకున్నారు. ఆదివారం రాత్రి కాల్వ వద్దకు వచ్చిన దొంగలు వీరి నలుగురికి చెందిన మోటార్లు, విద్యుత్ వైర్లను దొంగిలించారు. ఉడుత వీరన్న, వేముల నాగరాజులకు చెందిన మరో రెండు మోటార్లను దొంగిలించేందుకు ప్రయత్నించారు. సోమవారం పొలాల వద్దకు వెళ్లిన రైతులు మోటార్లు మాయమవ్వడాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. వానాకా లం సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో మోటార్లు చోరీకి గురికావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రిక్విజిషన్లపై ఆర్‌ఎంఓల విచారణ
కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రిలోని క్యాజువాలిటీలో పేషెంట్లకు అసంపూర్తిగా ఇస్తున్న రిక్విజిషన్లపై ఆర్‌ఎంఓలు డాక్టర్ రఘునాథస్వామి, డాక్టర్ మధుకర్ యాదవ్ సోమవారం విచారణ జరిపారు. క్యాజువాలిటీతో పాటు ఎక్స్‌రే రూంకు వెళ్లి విచారించారు. క్యాజువాలిటీలో సీఎంఓ, డీఎంఓ, ఓడీఎస్‌ఓ, డ్యూటీ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు సంబంధించిన రిక్విజిషన్లను సీఎంఓలు కూడా పరిశీలించాలని వారు సూచించారు. మ్యాన్ పవర్ తక్కువగా ఉండడం వల్ల తొందరలో రాయకుండా వదిలి వేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది.


