● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖానాపురం: కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని గడువులోగా పూర్తిగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు మండలంలోని మనుబోతులగడ్డ, పెద్దమ్మగడ్డ, ఖానాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, శ్రీనివాస, గోపికృష్ణ, సాయికృష్ణ రైస్ ఇండస్ట్రీస్‌లో దిగుమతులను ఆదివారం సందర్శించారు. కొనుగోళ్లు, సౌకర్యాలు, హమాలీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మనుబోతులగడ్డలో కొనుగోళ్లు ట్యాబ్‌లో జీరోగా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు రైతులు హమాలీలు, లారీల కొరత, మిల్లర్లు 43 కిలోలుగా దిగుమతులు చేసుకోవటం వంటి విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి తీసుకెళ్లాలని, 41 కిలోలతో దిగుమతులు చేసుకోవాలని సూచించారు. హమాలీల కొరతను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పంట అవశేషాలను కాల్చొద్దనే సూచనలతో ముద్రించిన కరపత్రాలను రైతులకు అందించారు. రైతులకు అన్యాయం జరగకుండా తూకాల నిర్వహణ చేపట్టాలన్నారు. ధాన్యం దిగుమతుల్లో పారదర్శకత పాటించాలన్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎస్‌ఓ కిష్టయ్య, సివిల్‌సప్లయీస్ డీఎం సంధ్యారాణి, డీఆర్డీఓ నాగపద్మజ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ నంగునూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.


