ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్..
విద్యారణ్యపురి : ఇంటర్ విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం వినూత్న సంస్కరణలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ సిలబస్‌లో ఇంటర్‌బోర్డు మార్పులు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 9, వరంగల్ 11, మహబూబాబాద్ 10, జయశంకర్ భూపాలపల్లి 5, జనగామ 7, ములుగులో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాలలు రీఓపెన్ చేయనున్నారు.
సైన్స్ సబ్జెక్టుల సిలబస్ తగ్గింపు..
ఇంటర్ ప్రథమ సంవత్సరం పాఠ్యపుస్తకాల సిలబస్‌లో మార్పులు చేశారు. సైన్స్ సబ్జెక్టుల పాఠ్యాంశాల్లో సిలబస్‌ను తగ్గించారు. ఫిజిక్స్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్,–ఫిజిక్స్ అధ్యాయాన్ని ప్రవేశపెట్టారు. గణితం పేపర్ 1ఏలో కొత్తగా సెట్స్ అండ్ రిలేషన్స్ సీక్వెన్సెస్ అండ్ సీరిస్ పాఠ్యాంశాలు చేర్చారు. గతంలోఉన్న పలు పాఠ్యాంశాలు, రిపీటెడ్ అంశాలను తగ్గించారు. తెలంగాణ సంప్రదాయాలు, కళలతో తెలుగు పాఠ్యపుస్తకాలను రూపొందించారు. నీట్, జేఈఈలో లేని పాఠ్యాంశాలను కూడా తొలగించారు. బాటనీలో రెండు పాఠ్యాంశాలు తొలగించి కొత్తగా ఎకనామిక్స్ బాటనీ అధ్యాయాన్ని చేర్చారు. జువాలజీలో సెరికల్చర్తోపాటు రెండు అంశాలను చేర్చారు. ఇంటర్ విద్యలో సీబీఎస్ఈ సిలబస్‌కు అనుగుణంగా పలు మార్పులు చేశారు.
పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్..
పాఠ్యపుస్తకాల కవర్‌పేజీలో మార్పులు చేసి మల్టీకలర్‌తో ముద్రించారు. ఈసారి క్యూఆర్‌కోడ్‌తో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తెరిచినరోజే ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పాఠ్యపుస్తకాలను ఇంటర్‌బోర్డు పంపింది. ఈసారి యూనిఫాం, నోట్‌బుక్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. జూన్ 12 నుంచి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
కొనసాగుతున్న అడ్మిషన్లు..
ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. హనుమకొండ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం 2,680 మంది విద్యార్థులు సెకండియర్‌లో ఉండగా.. శనివారం వరకు ఇంటర్ ఫస్టియర్‌లో 380 మంది విద్యార్థులు పవేశాలు పొందారు. 123 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. సెకండియర్‌లో 1,272 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 100 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. నాలుగు ఎయిడెడ్ కళాశాలలు, 11 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి.
అడ్మిషన్లు పెరుగుతాయని
భావిస్తున్నాం..
ఈసారి ఇంటర్లో వినూత్న మార్పులతోపాటు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. దీంతో ఇంటర్లో అడ్మిషన్ల సంఖ్య పెరగుతుందని భావిస్తున్నాం. విద్యార్థుల హాజరుశాతం పెరగనుంది. జూన్ ఒకటి నుంచి తరగతులకు విద్యార్దులు హాజరుకావాలి.
– ఎ.గోపాల్, డీఐఈఓ హనుమకొండ
ఫస్టియర్ సిలబస్‌లో మార్పులు
విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం
నేటినుంచి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం
ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. దీంతో విద్యార్థుల్లో ప్రయోగాత్మక విద్య అభ్యసనం పెరగుతుందని భావిస్తున్నారు. వివిధ సబ్జెక్టుల థియరీలో 80 మార్కులు ఇంటర్నల్‌లో 20 మార్కులు ఉంటాయి. ఈసారి అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్‌తో ఏసీఈ అనే నూతన గ్రూపును కూడా ప్రవేశపెట్టారు.


