● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండ: ప్రైవేట్ విద్యాసంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రతిభావంతులని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ కాన్ఫరెన్స్ హాల్‌లో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన టాప్ ర్యాంకర్లకు ఆదివారం రూ.10 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడినని, ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకున్నానని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఐపీఎస్ అధికారిగా విజయం సాధించానని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం తన నియోజకవర్గంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలకు రూ.10 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘స్ఫూర్తి’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రజాప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నానని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, డీఈఓ రంగయ్య నాయుడు, జిల్లా సైనన్స్ అధికారి శ్రీనివాస్ రావు, ఏసీజీఈ అరుణ పాల్గొన్నారు.


