ఉగాది.. భవిష్యత్‌కు పునాది | - | Sakshi
Sakshi News home page

ఉగాది.. భవిష్యత్‌కు పునాది

Mar 19 2026 10:32 AM | Updated on Mar 19 2026 10:32 AM

ఉగాది.. భవిష్యత్‌కు పునాది

వేప పువ్వుకు డిమాండ్‌

వేప పూత పులకరింతలు, మామిడి పిందెల పలకరింతలు, మోదుగచెట్ల మధురిమలు. తీరొక్క పూల పరిమళాలు.. నూతనత్వానికి ఆనవాళ్లు.. నూతన సంవత్సరాది వేడుకలు.

– హన్మకొండ కల్చరల్‌

తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ పండుగ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. సౌభాగ్యానికి , ప్రేమ, ఆధ్యాత్మిక చింతనకు, పల్లెల్లోని జానపదుల జీవనశైలికి సంకేతంగా నిలుస్తోంది. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజున కొత్తగా నిర్ణయాలు తీసుకునేందుకు ఇష్టపడతారు. పంచాంగం విని భవిష్యత్‌కు పునాది వేసుకుంటారు. కొత్త మజిలీలను వెతుక్కుంటారు. ‘శ్రీపరాభవ’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నేడు (గురువారం) ఉగాది పర్వదినం జరుపుకునేందుకు గ్రేటర్‌ వరంగల్‌ ప్రజలు సిద్ధమయ్యారు.

పచ్చడి ప్రత్యేకత..

చైత్రమాసం నాటికి కొత్తగా వచ్చే పంటలైన చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేప పూతను కొత్తకుండలో వేసి పచ్చడిగా చేసి భగవత్‌ నివేదనలుగా సమర్పిస్తారు. దీన్ని షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తారు. ఈ పానీయం తాగితే మండుటెండల నుంచి రక్షణ పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

వేయిస్తంభాల గుడిలో ప్రత్యేకం..

చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి ఆలయంలో 48 ఏళ్లుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేయన్నుట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ చెబుతున్నారు. సాయంత్రం సంస్కృత పండితులు సముద్రాల శఠగోపాచార్యులుచే పంచాంగశ్రవణం, కూచిపూడి నృత్యాలు, కవి సమ్మేళనం జరుగుతాయని వేయిస్తంభాల ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ తెలిపారు.

రోడ్ల వెంట రద్దీ..

ఉగాది పండుగను పురస్కరించుకుని పండుగకు కావాల్సిన కొత్త బెల్లం, కొత్త చింతపండు, నోము దండలు, జంద్యాలు, కొత్త కుండలు, దీపాంతలు, వివిధ రకాల పూలు, మోదుగపూలు, మోదుగాకులు, ఇసుక, మర్రి ఊడలు, పసుపు కుంకుమ గంధం, మామిడాకులు తదితర వస్తు సామగ్రి కొనుగోలు, అమ్మకాలతో నగరంలో సందడి ఏర్పడింది.

పరాభవ సంవత్సరంలో రాజు ‘గురువు’

శ్రీపరాభవ నామ సంవత్సరంలో గురువు రాజుగా, కుజగ్రహాలు మంత్రిగా ఉన్నాయి. గురువు రాజైతే పాలకులు కర్మయుక్తులు, ధర్మయుక్తులు అవుతారు. ప్రజలు సుభిక్షంగా జీవిస్తారు. పాడి అభివృద్ధి, బంగారం, ముత్యాలు, వస్తువుల ధరలు పెరుగుతాయి.

– గంగు ఉపేంద్రశర్మ,

వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు

రుషులు అందించిన అద్భుత విజ్ఞానం..

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు ఉన్నదే పంచాంగం. దీన్ని మహా విష్ణుస్వరూపంగా భావించి పూజించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి. నేటి ఆధునిక కాలపు నవీన విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో భారతీయులు పంచాంగం ద్వారానే కాలగతులు తెలుసుకునేవారు. ఎక్కడో ఉన్న గ్రహాలను వాటి దూరాలను ఎలాంటి టెలిస్కోప్‌ వంటి ఖగోళ విజ్ఞాన శోధన పరికరాలు లేకుండా భారతీయ మేధావులు సృష్టించిన ఒకానొక అద్భుతమే పంచాంగం.

– డాక్టర్‌ శ్రీఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి, ఆస్ట్రాలజర్‌

పంచాంగ శ్రవణానికి

ముస్తాబైన ఆలయాలు

నగరంలో పండుగ రద్దీ

నేడు వేయిస్తంభాల ఆలయంలో

పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం

బంచ్‌కు రూ.50 పలుకుతున్న ధర

సాక్షి, వరంగల్‌: ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వుకు ఈసారి మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. జిల్లాలోని చాలా మండలాల్లో వేప చెట్లు డైబ్యాక్‌, ట్రీమస్టికో వైరస్‌ బారిన పడడంతో కొమ్మలు మోడువారిపోయాయి. ప్రస్తుతం వేప పువ్వు దొరికే పరిస్థితి లేదు. కానీ ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేసుకునే వేప పువ్వుకు ఈసారి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. గ్రేటర్‌ వరంగల్‌లో బుధవారం రూ.20 నుంచి రూ.50 వరకు (చిన్న కట్ట, ఆకులతో కూడుకున్నది) వేప పువ్వును వ్యాపారులు విక్రయించారు.

ప్రముఖుల శుభాకాంక్షలు..

న్యూశాయంపేట/వరంగల్‌క్రైం/హన్మకొండ అర్బన్‌: పరాభవ నామ సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్‌ సత్యశారద, చాహత్‌ బాజ్‌పాయ్‌, పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో ఆయా జిల్లాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని వారు ఆకాంక్షించారు. తెలుగు వారి కొత్త సంవత్సరంలో అందరూ సంతోషం, శాంతి, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement