అదనపు కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్: వినియోగదారులు తమ హక్కులపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ ఎన్.రవి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో వినియోగదారులను చైతన్యవంతం చేయడం ద్వారా నాణ్యత ప్రమాణాలు కలిగిన వస్తువుల వినియోగం పెరుగుతుందని తెలిపారు. నాణ్యత లేని ఉత్పత్తులు కొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వస్తువులు కొన్నప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని, ఉత్పత్తి వివరాలు, నాణ్యతా ప్రమాణాలు పరిశీలించాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి వాజీద్ అలీ, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రతాప్ సింగ్ ఠాగూర్, వరంగల్ కన్జూమర్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ జగదీశ్ ప్రసాద్, అనుమాండ్ల విద్యాసాగర్, ఓరుగల్లు కన్స్మూర్ ఫోరం అధ్యక్షులు యుగేంధర్, తదితరులు పాల్గొన్నారు.


