పర్వతగిరి: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడం సమష్టి బాధ్యతని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) హైదరాబాద్ డాక్టర్ రవీంద్రనాయక్ సూచించారు. ఈ మేరకు వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం పర్యవేక్షించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు, ప్రోగ్రాం అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తల నుంచి వైద్యాధికారి వరకు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారులు మెడికల్ ఇన్‌స్టిట్యూట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని చెప్పారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధులను సర్వేల ద్వారా తెలుసుకొని వాటికి చికిత్స అందించాలని పేర్కొన్నారు. 14నుంచి 15ఏళ్ల వయస్సులోపు ఆడపిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ విజయ్‌కుమార్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ మౌనిక, పల్లె దవాఖాన వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీంద్రనాయక్


