లీకేజీ.. టేకిటీజీ! | - | Sakshi
Sakshi News home page

లీకేజీ.. టేకిటీజీ!

Jan 23 2026 9:08 AM | Updated on Jan 23 2026 9:08 AM

లీకేజ

లీకేజీ.. టేకిటీజీ!

వరంగల్‌ అర్బన్‌: పైపులైన్ల లీకేజీలను గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీర్లు టేకిటీజీగా తీసుకుంటున్నారు. లీకేజీలతో రోడ్లు ధ్వంసమవుతూ తాగునీరు మురుగు కాల్వల పాలవుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. అంతర్గత రహదారుల్లో కాదు.. ప్రధాన రహదారుల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఇలా ఏదో ఒక చోట కాదు.. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటతోపాటు 42 విలీన గ్రామాల్లో సుమారు 600 పైపులైన్లకు లీకేజీలు ఏర్పడి నీరంతా వృథాగా పోతోంది. ఆయా ప్రాంతాల్లోని పైపులైన్ల లీకేజీలపై బల్ది యా పాలకవర్గం, అధికార యంత్రాంగం దృష్టి సా రించడం లేదు. పైపులైన్ల లీకేజీల మరమ్మతులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా నీటి సరఫరా మెరుగుపడడం లేదని ప్రజలు చెబుతున్నారు.

మళ్లీ మళ్లీ మరమ్మతులు..

ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల్లో పైపులైన్ల లీకేజీలతో తాగునీరు వృథాగా పోతుండడం, రోడ్లు గుంతల పడడం, మళ్లీ రోడ్లు వేయడం మహా నగరంలో ఇంజనీర్లకు పరిపాటిగా మారింది. మరమ్మతులు చేపట్టిన చోట మళ్లీ మరమ్మతులు చేపడుతూ గ్రేటర్‌ ఖజానాకు గండిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి నిత్యం నగరంలో 174 ఎంఎల్‌డీల నీళ్లను శుద్ధి చేస్తున్నారు. ఇందులో 30 శాతం నీళ్లు లీకేజీలు, నల్లా అక్రమ కనెక్షన్ల ద్వారా వృథా అవుతున్నాయి. మరమ్మతుల కోసం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిధులు నీళ్లలా ఖర్చవుతున్నా లీకేజీలు మాత్రం నిరాటంకంగా ఉంటున్నాయి. మహా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు లీకేజీలకు మరమ్మతు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో ప్రజాధనం వృథాతోపాటు రోడ్లు దెబ్బతిని వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడనున్నారు.

లీకేజీలు ఎక్కడెక్కడంటే..

● వరంగల్‌–నర్సంపేట రోడ్డులోని ప్రైవేట్‌ వరంగల్‌ ఆస్పత్రి ఎదుట ఆరు నెలలుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లీకేజీతో నీరంతా వృథాగా పోతోంది. లేబర్‌ కాలనీలోని గౌరయ్య డబ్బా ఎదుట 15 రోజులుగా నీరు డ్రెయినేజీల్లో చేరుతోంది. వరంగల్‌ పోతనరోడ్డులోని ఓఎస్‌నగర్‌లో వారం రోజులుగా పైపులైన్‌ లీకేజీతో నీరు వృథాగా పోతోంది.

● గోవిందరాజుల గుట్ట రథం నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్లే రహదారి, ఆటోనగర్‌ రోడ్డు, దేశాయిపేట సీకేఎం కళాశాల ఎదుట, హనుమకొండలోని చైతన్య డిగ్రీ కళాశాల, అమృత ఆస్పత్రికి సమీపం తదితర ప్రాంతాల్లో పైపులైన్‌ పగిలి రోడ్లు దెబ్బతింటున్నాయి.

● హనుమకొండలోని కొత్త బస్‌స్టేషన్‌ రోడ్డు, శ్రీదేవి ఏషియాన్‌మాల్‌, కంచరకుంట, బాలసముద్రం, పద్మాక్ష్మి కాలనీ, మచిలీబజార్‌, మర్కజీ స్కూల్‌, కుమార్‌పల్లి, బ్రాహ్మణవాడ, కనకదుర్గ కాలనీ, తదితర కాలనీల్లో పైపులైన్ల లీకేజీలతో తాగునీరు వృథాగా పోతోంది.

లీకేజీలు అరికడతాం..

చలికాలంలో పైపులైన్లు లీకేజీలు సర్వసాధారణంగా తలెత్తుతాయి. లీకేజీలను మా దృష్టికి వచ్చిన వెంటనే మరమ్మతులు చేస్తున్నాం. లీకేజీలను గుర్తించాలని లైన్‌మెన్లను ఆదేశించాం. మంచినీరు వృథాగా కానివ్వకుండా చూసుకుంటాం.

– బల్దియా ఈఈ సంతోష్‌ బాబు

పైపులైన్‌ లీకేజీ మరమ్మతులను పట్టించుకోని గ్రేటర్‌ అధికారులు

డ్రెయినేజీల్లోకి వృథాగా

పోతున్న తాగునీరు

నగరంలో ధ్వంసమవుతున్న

రహదారులు, మురుగు కాల్వలు

వాహనదారులు,

పాదచారులకు ఇబ్బందులు

గేట్‌వాల్వ్‌ లీకేజీతో నీరు వృథాగా పోతున్న ఈ ఫొటో వరంగల్‌ జెమినీ థియేటర్‌ ఎదుట ఉన్న ప్రాంతంలోనిది. కొన్ని నెలలుగా నీరంతా డ్రెయినేజీల్లో కలుస్తోంది. రోడ్లు ధ్వంసమై వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నా కూతవేటు దూరంలో ఉన్న గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి ఇక్కడ మాత్రమే కాదు.. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటతోపాటు 42 విలీన గ్రామాల్లో సుమారు 600 పైపులైన్‌ లీకేజీలు ఉన్నాయి. మరమ్మతుల పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదని నగర ప్రజలు పేర్కొంటున్నారు.

లీకేజీ.. టేకిటీజీ!1
1/3

లీకేజీ.. టేకిటీజీ!

లీకేజీ.. టేకిటీజీ!2
2/3

లీకేజీ.. టేకిటీజీ!

లీకేజీ.. టేకిటీజీ!3
3/3

లీకేజీ.. టేకిటీజీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement