బలవంతపు బదిలీలు
హన్మకొండ: ఉద్యోగులను విద్యుత్ సంస్థల యాజమాన్యాలు బలవంతంగా బదిలీ చేస్తున్నాయి. జూన్, జూలైలో మాత్రమే చేయాలని, మధ్యలో బదిలీలు ఎలా చేస్తారని సంఘాలు, అసోసియేషన్లు ప్రశ్నించినా పట్టించుకోవడం లేదు. టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం డిసెంబర్ 27న హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పుడే బదిలీలు వద్దని సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయినా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం బదిలీలు చేపట్టేందుకు బుధవారం రాత్రి షెడ్యూల్ విడుదల చేసింది.
బదిలీ షెడ్యూల్..
బదిలీకి అర్హులైన జాబితాను ఈనెల 23 నాటికి టీజీ ఎన్పీడీసీఎల్ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తారు. జాబితాపై 25న మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 26 నుంచి 27 వరకు బదిలీ దఖాస్తులు, ఆప్షన్లు ఇవ్వాలి. 30న బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ నెల 31 నుంచి యథావిధిగా బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. సాధారణంగా ఫోకల్ పోస్టుల నుంచి నాన్–ఫోకల్ పోస్టులకు బదిలీలు ఉంటాయి. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అయ్యే వారికి, ఖాళీగా ఉన్న గ్రామీణ ప్రాంత పోస్టులను భర్తీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. గుర్తింపు పొందిన కొన్ని సంఘాల నాయకులకు రెండుసార్లు మాత్రమే బదిలీల నుంచి మినహాయింపు ఇస్తారు. ఇద్దరు ఉద్యోగుల మధ్య పోటీ ఏర్పడితే, ప్రస్తుత కేడర్‌లో ఎక్కువ సర్వీసు ఉన్నవారికి, ఆ తర్వాత వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యం ఇస్తారు.
బదిలీలకు అర్హతలు..
జనవరి ఒకటి నాటికి ప్రస్తుత స్థానంలో రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు బదిలీకి అర్హులు. ప్రతి కేడర్‌లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్యలో గరిష్టంగా 50 శాతానికి మించకుండా ఉద్యోగులను బదిలీ చేస్తారు. ఈ సంవత్సరం డిసెంబర్ 31లోపు రిటైర్మెంట్ అయ్యే వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. వారు కావాలని కోరుకుంటే బదిలీ చేస్తారు.
బదిలీ చేసే అధికారులు..
డివిజన్‌స్థాయిలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ అయిన జేఎల్‌ఎం నుంచి లైన్ ఇన్‌స్పెక్టర్ వరకు సెక్షన్ల మధ్య డివిజనల్ ఇంజనీర్ బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. సర్కిల్‌స్థాయిలో సబ్ ఇంజనీర్, ఇతర ఉద్యోగుల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వరకు జిల్లా ఎస్‌ఈ సర్కిల్ పరిధిలో బదిలీ చేస్తారు. డిస్కం స్థాయిలో ఏడీఈ, ఏఈ, డీఈ, అకౌంట్స్ ఆఫీసర్ల బదిలీలు కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉంటాయి. కార్పొరేట్ కార్యాలయంలో పనిచేసే ఆయా ఇంజనీర్లు, ఆయా అకౌంట్స్ ఆఫీసర్లు, పీ ఆండ్ జీ, పర్సనల్ విభాగం అధికారులను కార్పొరేట్ కార్యాలయంలో వేరే విభాగానికి లేదా ప్రాంతానికి బదిలీ చేస్తారు.
రెక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్స్..
ఒక సర్కిల్ నుంచి మరొక సర్కిల్‌కు రెక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ కోసం జనవరి 1 నాటికి సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకుని ఉండాలి. జేఎల్‌ఎం, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు సర్కిల్ మారితే సీనియారిటీని కోల్పోతారు. కొత్త యూనిట్‌లో చివరి ర్యాంకులకు అంగీకరించాల్సి ఉంటుంది. క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్లు ఉన్న వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరు.
వీరికి ప్రాధాన్యం..
బదిలీల సమయంలో వీరికి ప్రాధాన్యం ఉంటుంది. భార్యాభర్తలు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులైతే వారికి ప్రాధాన్యం ఇస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం డిసెంబర్ 31లోపు రిటైరయ్యే వారికి, 70 శాతం పైబడి అంగవైకల్యం కలిగిన వారికి, మానసిక వికలాంగులు లేదా ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, వితంతువులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు (క్యాన్సర్, కిడ్నీ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటివి) ఉన్నవారు, 5 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు.
వద్దని ముక్తకంఠంతో చెప్పిన
సంఘాలు, అసోసియేషన్ల నాయకులు
అయినా షెడ్యూల్ విడుదల చేసిన
టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం
కసరత్తు ప్రారంభించిన అధికారులు
బలవంతపు బదిలీలు


