ప్రకంపనలు రేపుతున్న ప్రజాప్రతినిధుల ఫోన్‌ ట్యాపింగ్‌.. | Sakshi
Sakshi News home page

ప్రకంపనలు రేపుతున్న ప్రజాప్రతినిధుల ఫోన్‌ ట్యాపింగ్‌..

Published Mon, Mar 25 2024 1:50 AM

- - Sakshi

ఏ–1గా ఇంటెలిజెన్స్‌ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు పేరు

ఆయన స్వగ్రామం ఆత్మకూరు మండలం నీరుకుళ్ల

ఇప్పటికే భూపాలపల్లి అడిషనల్‌ ఎస్పీ భుజంగరావు అరెస్ట్‌

ఉమ్మడి వరంగల్‌లో మరికొందరి పాత్రపైనా అనుమానం

ఓరుగల్లులో హైదరాబాద్‌ బృందం ఆరా..

సాక్షిప్రతినిధి, వరంగల్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రజాప్రతినిధుల ఫోన్‌ ట్యాపింగ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారం ఓరుగల్లులోనూ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా మొదలైన విచారణ ఇప్పుడు వరంగల్‌ చుట్టూ తిరుగుతోంది. కీలక పాత్రధారి అయిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌కుమార్‌ అలియాస్‌ ప్రణీత్‌రావు నిచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను ‘సిట్‌’ గుర్తించింది.

ఇందులో ఏ–4గా జేఎస్‌ భూపాలపల్లి అడిషనల్‌ ఎస్పీ భుజంగరావును గుర్తించిన విచారణ బృందం ఆదివారం రిమాండ్‌కు తరలించింది. ఇదే కేసులో ఇంటెలిజెన్స్‌ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు ఏ–1గా చేర్చడం కలకలం రేపుతోంది. ప్రభాకర్‌రావు స్వగ్రామం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం కావడంతో ఈ ప్రాంతంలో చర్చ జరుగుతోంది.

ప్రణీత్‌రావు సాక్ష్యమే ఆధారం..
మాజీ ఐజీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన ఎస్‌ఐబీ(పొలిటికల్‌) వింగ్‌లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్‌రావు ఇచ్చిన వివరాల ఆధారంగానే కేసు విచారణ జరుగుతోంది. ప్రణీత్‌ను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందం 15రోజుల క్రితం పాలకుర్తి, పర్వతగిరి, హన్మకొండ ప్రాంతాల్లో గోప్యంగా తనిఖీలు నిర్వహించింది. ఓ మాజీ మంత్రి కనుసన్నల్లో జనగామ జిల్లాలో వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్‌కు చెందిన అధికార, విపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల సెల్‌ఫోన్‌ సంభాషణలను ట్యాపింగ్‌ చేశారన్న ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలోనే సదరు కీలక ప్రజాప్రతినిధితో పాటు ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను ‘సిట్‌’ విచారించింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో లభ్యమైన కీలక ఆధారాలను పరిశీలించి ఏ–1గా ఇంటెలిజెన్స్‌ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు,ఏ–2గా సస్పెండైన డీఎస్‌పీ ప్రణీత్‌రావు, ఏ–3గా రాచకొండ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌, ఏ–4, ఏ–5లుగా అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఏ–6గా ఓ ప్రైవేట్‌ వ్యక్తిని చేర్చారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించిన పోలీసులు రాధాకిషన్‌, ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును విచారించేందుకు న్యాయపరమైన అనుమతులు తీసుకో వడం పోలీసుశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.

మరికొందరు పోలీసులపైనా అనుమానం..
ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. ఉమ్మడి వరంగల్‌లో మరికొందరి పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. ఈ ఇద్దరిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో పని చేసి.. ఎన్నికల కోడ్‌లో భాగంగా బదిలీపై ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న నలుగురు అధికారులను ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం విచారించినట్లు తెలిసింది. అంతకు ముందు కూడా ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై వచ్చిన ఫిర్యాదులపైనా ఆరా తీసినట్లు సమాచారం. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, శ్రవణ్‌రావు ఇళ్లల్లో పోలీసులు నిన్న, మొన్న తనిఖీలు నిర్వహించారు.

వారు ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో ‘లుక్‌ అవుట్‌’ సర్క్యూలర్‌ జారీ చేశారు. అయితే ప్రణీత్‌రావు వాంగ్మూలంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు పేర్కొనడంతో ఈ కేసు తుదిదశకు తెచ్చే ఉద్దేశంతో ‘సిట్‌’ హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లోనూ పలువురిని విచారిస్తుండడం కలకలం రేపుతోంది.

ఇవి చదవండి: ట్యాపింగ్‌ కేసులో ముగ్గురికి రిమాండ్‌

Advertisement
Advertisement