ఆర్టీసీ బస్టాండ్లలో ఖాళీ దుకాణాల వినియోగానికి చర్యలు
అర్హత ప్రామాణికంగా కేటాయింపులు..
ఎక్కడెక్కడ ఎలా అంటే..
అదనపు ఫ్లాట్‌ఫాంల నిర్మాణం..
● వనపర్తి పాత బస్టాండ్‌లోనూ
వాహనాల పార్కింగ్‌కు టెండర్లు
● సంస్థకు అదనపు ఆదాయంతో
పాటు నిరుద్యోగుల స్వయం ఉపాధికి అవకాశం
వనపర్తిటౌన్: ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో ఖాళీగా ఉన్న దుకాణాలను వినియోగంలోకి తీసుకొచ్చి సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చడంపై అధికారులు దృష్టిసారించారు. అందులో భాగంగా వనపర్తి ఆర్టీసీ డిపో పరిధిలోని వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, అడ్డాకుల బస్టాండ్లలో ఖాళీగా ఉన్న దుకాణాలు, వ్యాపార సముదాయాల నిర్వహణకు చర్యలు చేపట్టారు. తద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయం రావడంతో పాటు నిరుద్యోగులకు, వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారికి స్వయం ఉపాధి అవకాశం లభించనుంది. బస్టాండ్లలో దుకాణాల విస్తీర్ణం, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించాల్సిన వ్యాపారాలను సైతం అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు.
పాత బస్టాండ్‌లో పార్కింగ్..
దశాబ్దాల తర్వాత పునరుద్ధరించిన వనపర్తి పాత బస్టాండ్‌లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల బస్టాండ్ ప్రాంగణం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ పార్కింగ్ సదుపాయం ద్వారా సంస్థకు ఆదాయం సమకూర్చుకునేలా దృష్టిసారించారు. దీంతో కొత్త బస్టాండ్‌లోని వ్యాపార సముదాయాలతో పాటు పాత బస్టాండ్‌లోనూ ఉపాధి అవకాశాన్ని కల్పించినట్లయింది.
ఖాళీ స్థలాల సద్వినియోగం..
బస్టాండ్లలో అందుబాటులో ఉన్న దుకాణాలు, స్థలాలు నిరుపయోగంగా ఉండకుండా, వాటిని వ్యాపార అవసరాలకు వినియోగంలోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. తద్వారా సంస్థకు ఆదా యం పెరగడంతో పాటు ఆయా వ్యాపారాలపై పట్టున్నవారు, స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు మంచి అవకాశం లభించనుంది.
ఆర్టీసీ దుకాణాల కేటాయింపు అవకాశాన్ని నిరుద్యోగ యువత, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు, ఆయా వ్యాపార రంగాల్లో అనుభవం ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలు, టెండర్ నిబంధనల ప్రామాణికంగా దుకాణాల కేటాయింపులు ఉంటాయి. టెండర్లపై సందేహాలు ఉంటే నేరుగా వనపర్తి ఆర్టీసీ డిపోకు వచ్చి అధికారులను సంప్రదించాలి. పూర్తి వివరాలకు 94940 19474 నంబర్‌ను సంప్రదించాలి.
– దేవేందర్‌గౌడ్,
ఆర్టీసీ డిపో మేనేజర్, వనపర్తి
అడ్డాకుల బస్టాండ్‌లో పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలతో పాటు ఫొటో స్టూడియో, ఇంటర్నెట్ కేంద్రం నిర్వహణకు అవకాశం కల్పించారు. ఆత్మకూరు బస్టాండ్‌లో క్యాంటీన్, ద్విచక్ర వాహనాల పార్కింగ్ నిర్వహణకు టెండర్లు పిలిచారు. కొత్తకోట బస్టాండ్‌లో రెండు ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల నిర్వహణకు అవకాశం కల్పించారు. వనపర్తి బస్టాండులో బేకరీ, పాప్‌కార్న్, ఫ్యాన్సీ, జనరల్ దుకాణాల నిర్వహణకు స్థలాలను కేటాయించారు.
వనపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ఫ్లాట్‌ఫాంల కొరత కారణంగా బస్సులను ఎక్కడపడితే అక్కడ నిలుపుతున్నారు. కొన్ని బస్సులు బస్టాండ్ మధ్య ప్రాంతంలో, మరికొన్ని బస్సులు చెట్ల నీడన ఏళ్ల తరబడి ఉంటున్నాయి. ముఖ్యంగా వనపర్తి నుంచి రద్దీ అధికంగా ఉండే హైదరాబాద్, కర్నూలు, మహబూబ్‌నగర్ బస్సుల ఫ్లాట్‌ఫాంలు లేకపోవడంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రూ. 60లక్షలతో ఆర్టీసీ ఫ్లాట్‌ఫాంల పక్కనే అదనంగా మరో 4 ఫ్లాట్‌ఫాంల నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఫ్లాట్‌ఫాంలు అందుబాటులోకి వస్తే, ఆర్టీసీ బస్టాండ్‌లో అన్ని ప్రాంతాల బస్సులకు ఫ్లాట్‌ఫాంలు కేటాయించిట్లు అవుతుంది.


