సేంద్రియ సాగుతో మెరుగైన ఆదాయం | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగుతో మెరుగైన ఆదాయం

Nov 10 2026 12:37 AM | Updated on Nov 10 2026 12:37 AM

మదనాపురం: రసాయన ఎరువులు, పురుగు మందులపై అధికంగా ఆధారపడటం ద్వారా నేలలో సారం తగ్గడంతో పాటు పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఐసీఏఆర్‌ – ఎన్‌ఏఏఆర్‌ఎం జాయింట్‌ డైరెక్టర్‌ డా.గోపాల్‌ లాల్‌ అన్నారు. మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం గిరిజన ఉప ప్రణాళిక–2026 కింద గిరిజన రైతులకు ‘‘సుస్థిర వ్యవసాయానికి.. సేంద్రియ సాగు పద్ధతులు’’ అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటల వైవిధ్యీకరణ, మార్కెట్‌ ఆధారిత విస్తరణ విధానాలు, సుస్థిర నేల యాజమాన్య పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. స్థానిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ.. రసాయనాల వాడకాన్ని తగ్గించడం ద్వారా వ్యవసాయ వ్యయం తగ్గి, మెరుగైన ఆదాయం సాధించవచ్చని వివరించారు. అనంతరం కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త వి.రాజేంద్ర కుమార్‌ సేంద్రియ ఎరువులు, కంపోస్టు తయారీ సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ సాగుకు సంబంధించిన శిక్షణ పుస్తకాలు, సమాచార సాహిత్యాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. గిరిజన రైతులకు ఉచితంగా శిక్షణ కిట్లు, బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా.భవాని, డా. రమేశ్‌ నాయక్‌, డా.రేష్మా గిల్స్‌, డా.రంజిత్‌, ఆర్‌.అనిత, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్లు కె.రాజేశ్‌కుమార్‌, వి.విజయకుమార్‌, నాగేంద్ర, శ్రీనివాస్‌ సాగర్‌ పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో రుద్రహోమం

కొత్తకోట రూరల్‌: కానాయపల్లి స్టేజీ సమీపంలోని శ్రీకోటిలింగేశ్వరదత్త దేవస్థానంలో సోమవారం రుద్రహోమం నిర్వహించారు. కార్తీకమాసం ప్రారంభం, అమావాస్య సందర్భంగా లోకకల్యాణార్థం ఆలయంలోని స్వర్ణకవచ పంచలోహ శివలింగ నిలయంలో నిర్వహించిన ఈ హోమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వయంగా హోమ క్రతువులో ఆహుతులు సమర్పించారు. పండితుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా హోమం నిర్వహించి.. పూర్ణాహుతి సమర్పించడంతో పాటు కూష్మాండ బలిని నిర్వహించి క్రతువును ముగించారు. ఆలయ నిర్వహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement