వ్యాపారం బాగానే జరిగింది..
● మూడు రోజుల్లో రూ.3కోట్ల వ్యాపారం
● జోరుగా సాగిన బాణసంచా
విక్రయాలు
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలో టపాసుల విక్రయాలు జోరుగా సాగాయి. ఈ నెల 7 నుంచి 9 వరకు కేవలం మూడు రోజుల్లోనే సుమారు రూ.3 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో టపాసుల విక్రయాలకు ప్రత్యేకంగా 25 దుకాణాలను ఏర్పాటు చేయగా.. మరికొన్ని చోట్ల టపాసుల విక్రయ కేంద్రాలు వెలిశాయి. ఒక్కో దుకాణంలో రోజుకు రూ.1.50 లక్షలకు తగ్గకుండా, రూ.3 లక్షలకు పైగా విక్రయాలు సాగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు సుమారు రూ. కోటి మేర వ్యాపారం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. టపాసులు కొనుగోలు చేసేందుకు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు తమకు నచ్చిన బాణాసంచాను కొనుగోలు చేయడంతో దుకాణాల వద్ద సందడి నెలకొంది. కేవలం జిల్లా కేంద్రంలోనే ఈ స్థాయిలో వ్యాపారం జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇక జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో జరిగిన విక్రయాలను సైతం కలిపితే బాణాసంచా వ్యాపారం ఎంత స్థాయికి చేరి ఉంటుందోనని పలువురు అంచనాలు వేస్తున్నారు.
గతంతో పోలిస్తే ఈసారి బాణాసంచా వ్యాపారం ఆశాజనకంగా సాగింది. రోజు రూ.2.50 లక్షలకు పైగా బాణాసంచా విక్రయాలు జరిగాయి. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అన్ని రకాల బాణాసంచాకు గిరాకీ ఉండటంతో వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగాయి.
– మహేశ్, వ్యాపారి, వనపర్తి


