అమరచింత: జిల్లావ్యాప్తంగా 450 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల మొదటి వారంలోనే ప్రారంభించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 200 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే రైతులు ప్రైవేటుకే మొగ్గు చూపుతుండటంతో కొనుగోలు కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి. ప్రైవేటు వ్యాపారులు కల్లాల వద్దకే వెళ్లి క్వింటాకు రూ.3,500 నుంచి రూ.3,600 వరకు కొనుగోలు చేస్తుండటంతో.. ప్రభుత్వ కేంద్రాల్లో ఇప్పటివరకు కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, అమరచింత మండలంలో 5 కేంద్రాలను ప్రారంభించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఒక్క కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యం మొత్తం ప్రైవేటు వ్యాపారుల పరమవుతోంది. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్‌పై రైతులకు ముందస్తు అవగాహన కల్పిస్తే, ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదని పలువురు చర్చించుకుంటున్నారు. నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోలు వ్యవహారంపై డీఎం హరీశ్‌ను వివరణ కోరగా.. జిల్లాలో 200 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం రాలేదని తెలిపారు.


