ఉమ్మడి జిల్లాలో రూ.200 కోట్లకుపైగా సీఎమ్మార్ ధాన్యం పక్కదారి
అధికారులపై విచారణ ఎప్పుడు?
మిల్లర్లపై కేసులు..
● ఒక్క గద్వాల జిల్లాలోనే రూ.70 కోట్ల విలువైన ధాన్యం స్వాహా
● అక్రమాలకు పాల్పడిన 3 మిల్లులపై కేసులు.. ఇద్దరు మిల్లర్లు రిమాండ్
● మిల్లర్లకు సహకరించిన అధికారుల మాటేమిటి?
● ఇతర జిల్లాల్లో అధికారులపై
చర్యలు.. ఉమ్మడి పాలమూరులో
అంతా గప్‌చుప్
2025–26 ఖరీఫ్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
కేటాయించిన ధాన్యం వివరాలు....
జిల్లా మిల్లులు కేటాయించిన
ధాన్యం (మె.ట)
మహబూబ్‌నగర్ 77 1,47,938
గద్వాల 49 1,34,495
వనపర్తి 69 2,20,182
నాగర్‌కర్నూల్ 56 1,14,442
నారాయణపేట 51 1,40,266
అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారిని రిమాండ్‌కు పంపుతున్నాం. అదేవిధంగా మిల్లర్లకు సహకరిస్తున్న అధికారులపై ఇప్పటికే నిఘా పెట్టాం. ఇందులో భాగంగా ఇద్దరు డీటీలపై సస్పెన్షన్ వేటు వేశాం. పాత సిబ్బందిని మార్చాం. అవినీతికి పాల్పడిన అధికారుల పాత్రపై విచారణ జరుపుతున్నాం. దీనిపై ఇప్పటికే సీఐడీ దృష్టిసారించారు. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు.
– రిజ్వాన్‌బాషా షేక్, కలెక్టర్, గద్వాల జిల్లా
గద్వాల: ప్రభుత్వ ధాన్యం పక్కదారి పడుతున్నా.. బాధ్యులైన మిల్లర్లపై కేసులు నమోదవుతున్నా.. ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపై మాత్రం చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) కింద తిరిగి బియ్యంగా అప్పగించాల్సిన రైస్‌మిల్లర్లు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క గద్వాల జిల్లాలోనే సుమారు రూ.70 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తుండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ మొత్తం రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లాలో మరో మూడు మిల్లులపై కేసులు నమోదవడం ఈ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్న అధికారులు.. వారికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ శాఖలోని అధికారులపై ఎందుకు విచారణ చేపట్టడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మిల్లర్ల అవతారంలో అక్రమార్కులు
ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. సేకరించిన ధాన్యాన్ని మిల్లుల సామర్థ్యాన్ని బట్టి రైస్‌మిల్లర్లకు కేటాయించి, నిర్ణీత గడువులో సీఎమ్మార్ బియ్యం తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని నిబంధనలు విధిస్తోంది. అయితే ఈ ప్రక్రియలో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారాల్లో ఉన్నవారు, మిల్లింగ్ రంగంలో అనుభవం లేనివారు సైతం మిల్లుల ఏర్పాటుకు అనుమతులు పొందడం, ధాన్యం కేటాయింపులు దక్కించుకోవడం వెనుక కొందరు అధికారుల సహకారం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు, ధాన్యం కేటాయింపులు, సీఎమ్మార్ బియ్యం స్వీకరణ వరకు ప్రతి దశలోనూ అధికారుల పర్యవేక్షణ అవసరమనే నేపథ్యంలో ఈ ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది.
7.57 లక్షల టన్నుల ధాన్యం
2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉమ్మడి పాలమూరులో ప్రభుత్వం 7.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు కేటాయించింది. అక్టోబర్ 31 నాటికి సీఎమ్మార్ బియ్యం తిరిగి అప్పగించాల్సి ఉండగా.. అప్పటివరకు సగం మాత్రమే అందించినట్లు సమాచారం. అందులోనూ సన్నరకం ధాన్యానికి బదులుగా దొడ్డురకం బియ్యాన్ని అప్పగించి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నారాయణపేట, గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మూడు మిల్లులపై కేసులు
గద్వాల జిల్లాలో రాధాకృష్ణ రైస్‌మిల్, ఫరీదా రైస్‌మిల్, దువాసిపల్లి వెంకటేశ్వర మోడ్రన్ రైస్‌మిల్లులపై అక్రమాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు మిల్లర్లు రిమాండ్‌కు వెళ్లారు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లపై పోలీసు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఈ అక్రమాలు జరగడానికి కారణమైన అధికారుల పాత్రపై మాత్రం సమగ్ర విచారణ జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
గద్వాల జిల్లాలోని ఫరీదా రైస్
మిల్లులో అధికారుల సోదాలు(ఫైల్)
రాష్ట్రంలోని కరీంనగర్, ములుగు, నిజామాబాద్ జిల్లాల్లో సీఎమ్మార్ అక్రమాల వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి అధికారులపైనా చర్యలు చేపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం ఇప్పటివరకు బాధ్యులైన అధికారులపై చర్యలు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మిల్లర్లకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై రాజకీయ అండదండలు, ఉన్నతస్థాయి పలుకుబడితో చర్యలు లేకుండా చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ముఖ్యంగా గద్వాల సివిల్ సప్లయీస్ శాఖలో ఓ ఉన్నతాధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారిక విచారణలో వాస్తవాలు తేలాల్సి ఉంది. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టిన వ్యవహారంలో మిల్లర్లతోపాటు బాధ్యులైన అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.


