వనపర్తి: ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్ సేవలపై ప్రతి ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులకు ఐఎఫ్‌ఎంఐఎస్, ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసు, సెలవులు, బిల్లులు, ఇతర ఉద్యోగ సేవలకు ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌ను వినియోగించుకోవాలన్నారు. ఉద్యోగుల సేవలను ఆనన్‌లైన్‌లో నిర్వహించేందుకు పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సేవలు, వినియోగ విధానంపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని అధికారులు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ట్రెజరీశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్ విధివిధానాలు, అందుబాటులో ఉన్న సేవలు, వినియోగించుకునే పద్ధతులపై ఉద్యోగులకు వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రాంరెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఏటీఓ హరికృష్ణ, ఎస్‌టీఓలు రాందాస్, రాజేష్ కన్నా, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


