వనపర్తి: గ్రామీణ మహిళల్లోని ప్రతిభను వెలికితీసి నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. నాబార్డు సహకారంతో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణసంస్థ (యూబీఐ ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా ‘జాపామైడ్ కమ్ హోమ్‌క్యులినరీ ఎక్స్‌పర్ట్’ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాకేంద్రంలో నిర్వహించారు. అక్టోబర్ 3 నుంచి 28 వరకు 60 మంది మహిళలకు నవజాత శిశువుల సంరక్షణ, బాలింతల ఆరోగ్య పరిరక్షణ, తల్లీబిడ్డల సంరక్షణ, గృహ వంటకాలు తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ నర్సింగ్, వైద్య కళాశాల అధ్యాపకులతో బోధన అందించడంతో పాటు ఆస్పత్రుల్లో ప్రాక్టికల్ శిక్షణనిచ్చారు. ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ బి.అనిల్‌కుమార్ చొరవతో హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన POQTEA Medicalervicer సంస్థతో ఉద్యోగ అనుసంధానం కల్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 36 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గురువారం జిల్లాకేంద్రం సమీపంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవసరమైన ప్రతి అవకాశాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్‌పర్సన్ మధుసూదన్‌గౌడ్, పీఓఆర్‌టీఈఏ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్, ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ బి.అనిల్‌కుమార్, డీఆర్డీఓ ఉమాదేవి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్‌రెడ్డి, ఎల్‌డీఎం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


