శతశాతం లక్ష్యాన్ని సాధించాలి | - | Sakshi
Sakshi News home page

శతశాతం లక్ష్యాన్ని సాధించాలి

Nov 6 2026 12:38 AM | Updated on Nov 6 2026 12:38 AM

వనపర్తి: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులోగా 100 శాతం సాధించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. భాస్కర్‌నాయక్‌ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలో జిల్లాస్థాయి ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మాత, శిశుసంరక్షణ, రక్తహీనత నివారణ, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, కుటుంబ నియంత్రణ, అసంక్రమిక వ్యాధుల నివారణ, టీబీ ముక్త్‌భారత్‌, కుష్టు నిర్మూలన తదితర కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యసేవలు అందించాలన్నారు. చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పోషకాహార లోపం, రక్తహీనత ఉన్నవారిని గుర్తించి చికిత్స అందించాలని కోరారు. 30 ఏళ్లు నిండిన వారందరికీ రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాల వ్యాధుల పరీక్షలు నిర్వహించాలన్నారు. మలేరియా, డెంగీ వంటి కీటక జనిత వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, క్షయ బాధితులకు సకాలంలో చికిత్సతో పాటు పోషకాహార కిట్లు అందించాలని ఆదేశించారు. అలాగే మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించాలని, వృద్ధులకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలన్నారు. అన్ని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాల్లో పూర్తిస్థాయి వైద్యసేవలు, టీ డయాగ్నోస్టిక్స్‌ ద్వారా పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. 108, 102 సేవలు నిరంతరాయంగా అందేలా పర్యవేక్షించాలన్నారు. ప్రతి ప్రోగ్రాం అధికారి తమ పరిధిలోని కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డా. మారుతినందన్‌గౌడ్‌, డా. వంశీకృష్ణ, డా. రాకేష్‌రెడ్డి, మంజుల, వివిధ ఆరోగ్య కార్యక్రమాల కో–ఆర్డినేటర్లు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement