నేడు విద్యుత్‌ గ్రీవెన్స్‌ డే | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌ గ్రీవెన్స్‌ డే

Nov 6 2026 12:38 AM | Updated on Nov 6 2026 12:38 AM

వనపర్తిటౌన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం జిల్లాకేంద్రంలోని బాలానగర్‌లో ఉన్న విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ చిన్నం తాతారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుందని.. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, మీటర్లు, బిల్లులు, కొత్త కనెక్షన్లు, యాజమాన్య బదిలీ, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు తదితర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారులు ఆధార్‌కార్డు, విద్యుత్‌ బిల్లు రసీదుతో హాజరుకావాలని.. సర్కిల్‌ పరిధిలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

జూరాల కాల్వలకు

నీటి సరఫరా బంద్‌

అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి సరఫరాను గురువారం తెల్లవారుజామున నిలిపివేశారు. వారబందీ విధానంలో జూరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్న ప్రాజెక్టు అధికారులు గత నెల 31న చివరితడి అంటూ ఐదురోజుల పాటు నీటిని వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 1.702 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని ఏఈ సుదర్శన్‌ తెలిపారు. ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. వానాకాలంలో రైతులు అత్యధికంగా వరి సాగుచేశారు. అదేవిధంగా కుడి కాల్వ పరిధిలో 35 వేల ఎకరాలు ఉండగా.. 20 వేలు మాత్రమే సాగైంది. ప్రస్తుతం ఇదే చివరితడి అని కాల్వలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోతడి ఇవ్వాలని కోరుతున్నారు.

సమాచార భద్రత

పాటించాలి

వనపర్తిటౌన్‌: ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సామాజిక మాధ్యమాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అమ్మాయిలు వ్యక్తిగత చిత్రాలు, సమాచార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి దీప కాసరగడ్డ తెలిపారు. న్యాయసేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించగా.. ఆమె హాజరై మాట్లాడారు. ఫొటోల మార్ఫింగ్‌, ఆన్‌లైన్‌ వేధింపులను తేలికగా తీసుకోకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అమ్మాయిలు విద్యతో పాటు వ్యక్తిగత భద్రత, చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయగలరని తెలిపారు. అదేవిధంగా సైబర్‌ దాడులు, బాల్యవివాహాల నియంత్రణ, మోటారు వాహనాల చట్టం, సామాజిక మాధ్యమాల పరిమిత వినియోగంపై అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన ఉండటంతో హక్కులను కాపాడుకోవడంతో పాటు అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత లేని వారికి కూడా ఉచిత న్యాయసేవలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు టోల్‌ఫ్రీ నంబర్‌ 15100 సంప్రదించాలని సూచించారు. న్యాయవాది ఎం.రఘు, కళాశాల ఉప ప్రిన్సిపాల్‌ షరా, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

వనపర్తి రూరల్‌: జిల్లాలోని పాడిరైతులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి వెంకటయ్యగౌడ్‌ సూచించారు. గురువారం వనపర్తి మండలం కడుకుంట్ల, శ్రీరంగాపురం మండలం శేరుపల్లిలో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్యశిబిరం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని పశువులకు టీకాలు, మందులు వేశారు. దూడల్లో నులిపురుగుల నివారణ, ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయన వెంట కడుకుంట్ల సర్పంచ్‌ తిరుపతయ్య, శేరుపల్లి సర్పంచ్‌ మేకల వెంకటయ్య, మండల పశు వైద్యాధికారి రాజేష్‌ఖన్నా, మాధవి, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement