వనపర్తి: వరి ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, సీఎంఆర్ ప్రక్రియలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే కొందరు మిల్లర్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు తాజా పరిణామాలతో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గోపాల్‌పేట మండలం బుద్ధారం గ్రామంలోని ఓ రైస్‌మిల్లులో ధాన్యం నిల్వల లెక్కల్లో వ్యత్యాసాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. స్థానిక అధికారులు, విజిలెనన్స్ బృందం వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో వ్యత్యాసం ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సుమారు రూ.1.50 కోట్ల విలువైన ధాన్యం తేడాలున్నట్లు విజిలెన్స్ తనిఖీల తర్వాత పంచనామాతో వెల్లడవుతోంది. ఇప్పటి వరకు స్థానిక పౌరసరఫరాలశాఖ అధికారులు చేపట్టిన అన్ని మిల్లుల్లో రాష్ట్రస్థాయి విజిలెన్స్ అఽధికారులతో తనిఖీలు చేపడితే చాలా అక్రమాలు వెలులోకి వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
సుమారు 14,900 బస్తాలు..
మిల్లులో ధాన్యం నిల్వలు, రికార్డుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత తనిఖీ చేసిన స్థానిక అధికారులు అన్ని సక్రమంగా ఉన్నాయనే నివేదిక ఇవ్వగా.. శుక్రవారం రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందం తనిఖీలు నిర్వహించగా సుమారు 14,900 బస్తాల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించడం గమనార్హం. ఈ విషయం బయటకు రావడంతో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే మిల్లులో ధాన్యం నిల్వలపై నిర్వహించిన తనిఖీల్లో అధికారులు వేర్వేరు లెక్కలు చూపిస్తుంటే.. జిల్లావ్యాప్తంగా పెండింగ్ సీఎంఆర్ ఉన్న మిల్లుల్లోని లెక్కల్లో ఏ మేర తేడాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం నిల్వలు, మిల్లింగ్‌కు వచ్చిన ధాన్యం, బియ్యం ఉత్పత్తి, ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ పరిమాణం, మిగిలిన నిల్వల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తేనే అసలు విషయం తేలనుంది.
అక్రమాలు కప్పిపుచ్చే ప్రయత్నాలు..?
మిల్లులో భారీగా ధాన్యం వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వాస్తవాలను పూర్తిస్థాయిలో బయటపెట్టకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లతో లోపాయికార ఒప్పందాలతో అనుకూలంగా వ్యవహరిస్తూ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు జిల్లావ్యాప్తంగా గుప్పుమంటున్నాయి.
వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమే..
బుధవారం స్థానిక అధికారులు, శుక్రవారం విజిలెన్స్ బృందం బుద్దారం రైస్‌మిల్లులో తనిఖీలు చేపట్టాయా. లెక్కల్లో తేడా వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ రెండ్రోజుల్లో ఏం జరిగిందో తెలియదు. చాలా తేడాలు ఉన్నట్లు విజిలెన్స్ బృందం పంచనామాలో పేర్కొంది. సదరు మిల్లు నిర్వాహకులు మూడు వేర్వేరుచోట్ల గోదాంలను ఏర్పాటు చేసుకొని ధాన్యం నిల్వ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారో ఎవరికి తెలుసు. – ఆంజనేయులు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
●
బుద్ధారం రైస్‌మిల్లులో స్థానిక అధికారులు, విజిలెన్స్ బృందం వేర్వేరుగా తనిఖీలు
రూ.1.50 కోట్ల విలువైన ధాన్యం వ్యత్యాసాలపై అనుమానాలు
మిల్లర్లతో అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు
ప్రభుత్వ ధాన్యానికి భద్రత కరువు..
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు అప్పగించి నిర్ణీత గడువులోగా తిరిగి బియ్యాన్ని సేకరించే ప్రక్రియలో నిల్వల నిర్వహణ అత్యంత కీలకం. ఈ క్రమంలో ధాన్యం లెక్కల్లో భారీ వ్యత్యాసాలు చోటుచేసుకుంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే జిల్లాలోని సుమారు 120 మిల్లుల నుంచి సుమారు రూ.400 కోట్లకుపైగా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా.. అందులోని కనీసం పదిశాతం ధాన్యం నిల్వలు సైతం లేకపోవడం గమనార్హం.


