వెనుబడిన విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు విద్యాశాఖ కృషి
ఏఐ బోధన ఇలా..
వెనుకబడ్డ విద్యార్థుల కోసమే..
● ఏఎక్స్‌ఎల్ పేరుతో సామర్థ్యాల
పెంపునకు శ్రీకారం
● ఉమ్మడి జిల్లాలో 192..
జిల్లాలో 28 పాఠశాలలు ఎంపిక
● ఆయా పాఠశాలలకు కంప్యూటర్లు, సామగ్రి సరఫరా
నర్వ: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థుల విద్యా సామర్థ్యాల పెంపునకు మరో ముందడుగు పడింది. ఇప్పటికే ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం అమలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు లేవు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఎక్స్‌ఎల్ పేరిట ఏఐ ద్వారా అసిస్టెంట్ సహకారంతో విద్యా సామర్థ్యాలు మెరుగుపర్చేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలలకు అవసరమైన కంప్యూటర్లు, సామగ్రిని రాష్ట్ర విద్యాశాఖ సరఫరా చేసింది.
ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షలు..
ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో విద్యా సామర్థ్యాలు ఉండటం లేదని ఇటీవల కేంద్రం విడుదల చేసిన పీజీఐ సర్వేతో స్పష్టమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని 192 ప్రాథమిక పాఠశాలలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు మూడు నుంచి 5 కంప్యూటర్ల చొప్పున మొత్తం 735 కంప్యూటర్లు సరఫరా చేశారు. వీటితో పాటు ఒక్కో కంప్యూటర్‌కు రెండు హెడ్‌సెట్‌లు, యూపీఎస్‌లు, టేబుళ్లు, కుర్చీలు, ఇంటర్‌నెట్ సౌకర్యం, విద్యుత్ సరఫరా పరికరాలు అందజేశారు.
నీతి ఆయోగ్ సూచన మేరకు..
జిల్లాలో నీతి ఆయోగ్ సూచన మేరకు ప్రత్యేకంగా స్పార్క్ (స్కూల్ ప్రోగ్రామ్ ఫర్ ఏఐ రెడినెస్ అండ్ నాలెడ్జ్) ద్వారా ప్రాథమిక పాఠశాలలో ఏఎక్స్‌ఎల్ డిజిటల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం యాస్పిరేషన్ బ్లాక్ నర్వ మండలంలో ప్రతి ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసి ఏఐ కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వీటి పనితీరును పరిశీలించేందుకు కొన్నిరోజుల కిందట నీతి ఆయోగ్ అధికారులు నర్వ మండలాన్ని సందర్శించారు. పాఠశాలల్లో కంప్యూటర్ల ద్వారా ఏఐ అసిస్టెంట్‌తో అందించిన విద్యాబోధన క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇస్తుందని కితాబిచ్చారు.
ఏఎక్స్‌ఎల్ కార్యక్రమానికి ఎంపికై న పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తిస్తారు. వీరికి కంప్యూటర్‌లో ప్రత్యేకంగా ఇన్‌స్టాల్ చేసిన ఏఐ అసిస్టెంట్ ద్వారా ఉపాధ్యాయులు బోధన అందిస్తారు. ప్రధానంగా తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్యాంశాలకు సంబంధించి ఏయే అంశాల్లో విద్యార్థులు వెనకబడ్డారో ఏఐ అసిస్టెంట్ గుర్తించి వారికి అక్షరాలు, అంకెలు గుర్తించడం, చదవడం, లెక్కలు చేయడంలో సాయం అందించి విద్యా సామర్థ్యాల మెరుగునకు చర్యలు తీసుకుంటారు.
ఏఎక్స్‌ఎల్ ప్రోగ్రామ్ ద్వారా జిల్లాలో ఎంపికచేసిన 28 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన అందిస్తున్నాం. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు వెనుకబడ్డ పాఠ్యాంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ఏఐ ద్వారా ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. ఎంపికై న పాఠశాలల్లో కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట


