వనపర్తి పురపాలికలో యథేచ్ఛగా సెల్లార్ల నిర్మాణం
డీటీఎఫ్‌కు నివేదించాం..
నోటీసులు జారీ చేసినా..
వనపర్తిటౌన్: భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వనపర్తి పురపాలికలో అధికార పక్షానికి చెందిన కొందరు కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పాలకవర్గంలో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి సెల్లార్ల నిర్మాణాల అంశం వివిధ సందర్భాల్లో తెరపైకి వస్తూనే ఉంది. సమావేశాల్లో కౌన్సిలర్లు పలుమార్లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు, పాలకవర్గం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే హెచ్చరించినా..!
సెల్లార్ల నిర్మాణాలపై మే నెల 2న జరిగిన పుర సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. సెల్లార్లకు అనుమతులు లేవనే విషయం తెలిసినా ఎందుకు మౌనం వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించడంతో పాటు పుర అధికారుల పేర్లు చెప్పి రూ.9 లక్షలకుపైగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోందని ప్రస్తావిస్తూ.. ఇలాంటి పరిస్థితులకు తావివ్వకుండా తమ పద్ధతి మార్చుకోవాలని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
కొత్తకోట రోడ్‌లోనే ఎక్కువగా..?
జిల్లాకేంద్రంలోని కొత్తకోట రోడ్ పరిసరాల్లో ఎక్కువగా అక్రమ సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రాజనగరం, అయ్యప్ప రోడ్, భగీరథనగర్, ఫుడ్ కోర్టు అవతలి ప్రాంతాల్లోనూ ఇలాంటి నిర్మాణాలు ఉన్నట్లు సమాచారం. ఓ వైపు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నా.. మరోవైపు నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాత బస్టాండ్ ప్రాంతంలో సెల్లార్ నిర్మాణానికి గుంత తీయడంతో పక్కనే ఉన్న భవన యజమాని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు పుర అధికారులు అక్కడ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
వనపర్తిలోని
బసవన్నగడ్డలో
కొనసాగుతున్న సెల్లార్ నిర్మాణం
కొత్తకోట రోడ్‌లోనే అధికం
ఎమ్మెల్యే, అధికార పార్టీ కౌన్సిలర్లు హెచ్చరించినా
ఆగని వైనం
నోటీసులకే పరిమితమైన అధికారులు
సెల్లార్ల నిర్మాణానికి ఏ భవన యజమాని అనుమతి తీసుకోలేదు. అక్రమ నిర్మాణాల విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా భవన నిర్మాణ యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీకి నివేదించాం. అనుమతులు లేని సెల్లార్లతో ఉన్న భవనాల క్రయవిక్రయాలు జరగకుండా చూడాలని సబ్‌రిజిస్ట్రార్‌కు సూచించాం. విద్యుత్, కొళాయి కనెక్షన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు విన్నవించాం. నిబంధనల మేరకు మా పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాం.
– శివకుమార్,
పట్టణ ప్రణాళిక అధికారి, వనపర్తి
పుర పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఇప్పటి వరకు అక్రమంగా సెల్లార్ల నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆయా భవన నిర్మాణాలకు అనుమతి ఉన్నప్పటికీ సెల్లార్ల నిర్మాణానికి మాత్రం అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వీరికి షోకాజ్ నోటీసులు, అనంతరం స్పీకింగ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీకి సైతం నివేదించినట్లు అధికారులు చెబుతున్నారు. అక్రమంగా సెల్లార్లు నిర్మించిన భవనాల క్రయవిక్రయాలు జరగకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్యుత్, కొళాయి కనెక్షన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు సూచించినట్లు సమాచారం.


